వాషింగ్టన్: పోలీసుల ఛేజింగ్‌లో నిందితుల కారు అదుపు తప్పి బోల్తా పడింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిందితులు ప్రయాణిస్తున్ బ్లాక్ కారును పోలీసులు తమ వాహనాల్లో వెంబడించారు. అయితే వేగంగా వెళ్తున్న నిందితుల కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో అది రోడ్డుపై జారి ఒక పక్కకు బోల్తాపడింది. ఒక చెట్టును ఢీకొట్టి ఆగింది. అనంతరం అందులో ఉన్న నిందితులు బయట పడి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఒక ఇంటి సమీపంలో ఈ సంఘటన జరుగడంతో దాని యజమాని బోల్తా పడిన కారులోని వారిని రక్షించేందుకు ముందుకు వచ్చాడు. అంతలోనే వాహనాల్లో అక్కడకు చేరుకున్న పోలీసులు చూసి అతడు వెనక్కి తగ్గాడు.
కాగా, నిందితుల్లో ఒకర్ని పోలీసులు పట్టుకున్నారు. పారిపోతున్న మరో వ్యక్తిని పట్టుకునేందుకు అతడి వెంట పరుగులు తీశారు. ఆ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీలో ఇది రికార్డైంది. దీంతో ఈ వీడియో క్లిప్‌ను ఆ ఇంటి యజమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన పని తర్వాత ఇంటికి తిరిగి రాగా ఈ సంఘటన జరిగినట్లు పేర్కొన్నారు. అయితే ఇది ఎక్కడ జరిగింది అన్నది అతడు పేర్కొనలేదు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా, ఇందులో చాలా సంఘటనలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. బోల్తా పడిన కారు వద్దకు ఒక వ్యక్తి వచ్చేందుకు ప్రయత్నించడం, పోలీసుల చేతుల్లో తుపాకులు చూసి అతడు వెనక్కు తగ్గడం, బోల్తా పడిన కారు నుంచి వ్యక్తులు బయటపడి పారిపోయేందుకు ప్రయత్నించడం, పోలీసులు వారి వెంటపడటం, ఛేజింగ్‌కు ఇష్టపడని పోలీస్ డాగ్‌ను పిల్లాడి మాదిరిగా ఒక పోలీస్ తీసుకెళ్లడం వంటివి ఇందులో ఉన్నాయని ఒకరు తెలిపారు. అయితే ఈ వీడియోలోని అన్ని సంఘటనలు చూసేందుకు దీనిని ఐదు సార్లు చూసినట్లు మరో వ్యక్తి పేర్కొన్నాడు.