న్యూఢిల్లీ: ఒక ట్రాఫిక్ పోలీస్ చీపురును చేతిలో పట్టుకుని రోడ్డు ఊడ్చారు. రోడ్డుపై పడిన కంకర రాళ్లను శుభ్రం చేశారు. ఒక ఐఏఎస్ అధికారి ట్వీట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కంకరను రవాణా చేసే వాహనం నుంచి చిన్నచిన్న కంకర రాళ్లు రోడ్డుపై పడ్డాయి. ద్విచక్ర వాహనాలు జారే ప్రమాదంతోపాటు వాటి టైర్లు పంక్చర్ అయ్యే అవకాశముంది. ఇది గ్రహించిన అక్కడున్న ట్రాఫిక్ పోలీస్ వెంటనే స్పందించారు. ట్రాఫిక్ సిగ్నల్ పడగానే చీపురు చేత పట్టి రోడ్డుపై పడిన కంకరను పక్కకు ఊడ్చారు. ఈ సందర్భంగా వాహనాలు ఆయన వైపు రాకుండా ఒక వాలంటీర్ సహకరించాడు.
కాగా, ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ గురువారం తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘మిమ్మల్ని గౌరవిస్తున్నా’ అని అందులో పేర్కొన్నారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అన్నది ఆయన ప్రస్తావించలేదు.
మరోవైపు రోడ్డును ఊడ్చిన ట్రాఫిక్ పోలీస్‌కు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. విధి నిర్వాహణలో ఆయన సిన్సియార్టీని నెటిజన్లు కొనియాడారు. ఆ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాల నంబర్ ప్లేట్ ద్వారా ఈ సంఘటన తమిళనాడులో జరిగి ఉంటుందని కొందరు అంచనా వేశారు.
Respect for You.🙏 pic.twitter.com/Bb5uZktpZk
— Awanish Sharan (@AwanishSharan) June 16, 2022