బెర్లిన్: ఒక స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. దీంతో కరిగిన ఉక్కు కంటైనర్ నుంచి ఎగసిపడింది. భగభగ మండే కరిగిన ఉక్కు ఆ ప్రాంతమంతా విస్తరించింది. అయితే ఈ ప్రమాదానికి ముందు అక్కడి కార్మికులు వెనక్కి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. జర్మనీలోని స్టీల్ ప్లాంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ వీడియో క్లిప్‌ను రెడ్డిట్‌లో ఒకరు పోస్ట్ చేశారు. కరిగిన ఉక్కు ఉన్న కంటైనర్ ధ్వంసమైంది. అయితే దీనిని పసిగట్టడంతో సైరెన్ మెగించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న కార్మికులు మెల్లగా వెనక్కి వెళ్లారు.
ఇంతలో ఉన్నట్టుండి కరిగిన ఉక్కు ఆ కంటైనర్ నుంచి ఒక్కసారిగా ఎగసిపడింది. లావా మాదిరిగా అది నేలపై విరజిమ్మింది. నిప్పులకుంపటిగా ఉన్న కరిగిన ఉక్కు ఆ ప్రాంతంలో పలు చోట్ల విస్తరించింది. అయితే కార్మికులు చాకచక్యంగా దూరంగా వెళ్లారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. కేవలం అక్కడున్న సైకిల్ మాత్రం ధ్వంసమైంది.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. 1991 నాటి ‘టెర్మినేటర్: ది జడ్జిమెంట్ డే’ సినిమాను ఇది గుర్తుకు తెచ్చిందని ఒకరు కామెంట్ చేశారు. అయితే కార్మికులు చాలా తాపీగా దూరంగా వెళ్లడంపై కొందరు సెటైర్లు వేశారు. ఇలాంటి ప్రమాదాలు వారికి కామన్ అని వ్యాఖ్యానించారు.