e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home ట్రెండింగ్‌ జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు.. బాధ్యత నాదే

జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు.. బాధ్యత నాదే


మరణించిన జర్నలిస్టుల పిల్లలకు రెసిడెన్షియల్‌ స్కూళ్లల్లో విద్య
పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.. అన్ని వర్గాలకు అండగా సర్కార్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అనేందుకు విపక్ష నేతలకు ఎన్ని గుండెలు?
మేం మాట్లాడితే మీరు తట్టుకోలేరు..
పాత్రికేయుల భేటీలో మంత్రి కేటీఆర్


హైదరాబాద్‌, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులందరికీ ఇండ్లస్థలాలు ఇచ్చే బాధ్యత తీసుకొంటున్నానని.. త్వరలోనే వారి కల నెరవేరుతుందని ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి జర్నలిస్టులకు, టీఆర్‌ఎస్‌కు, ప్రభుత్వానికి మధ్య విడదీయలేని బంధమున్నదన్నారు. ఆదివారం జలవిహార్‌లో మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘మీ అందరికీ ఏం కావాలో నాకు తెలుసు. ఎవరేమి మాట్లాడినా.. ఎవరేమి కుప్పిగంతులు వేసినా కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటరు. మీలో ఒకడిగా.. మీ సోదరుడిగా నేను మాటిస్తున్న.. మీ అందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంట.

- Advertisement -


ఉద్యమం నాటి నుంచి ఈనాటి వరకు ఎవరైతే అండగా ఉన్నారో.. వారందరినీ కాపాడుకున్నం’ అని కేటీఆర్‌ చెప్పారు. ‘పనిచేసే ప్రభుత్వం కోరుకునేది ఒక్కటే. మీ సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వాన్ని గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో ఆశీర్వదించండి. జర్నలిస్టులుగా కాకుండా సగటు తెలంగాణ బిడ్డగా ఆలోచించండి’ అని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి వందకోట్ల నిధిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏ రాష్ట్రమైనా ఉందా? అని మంత్రి ప్రశ్నించారు. ‘మరణించిన 260 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున మీడియా అకాడమీ ద్వారా సహాయం చేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. జర్నలిస్టు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా చూడాల్సిన బాధ్యత మామీద ఉన్నది.
మరణించిన జర్నలిస్టుల పిల్లలను రెసిడెన్షియల్‌ స్కూళ్లల్లో చేర్పించి విద్యాబుద్ధులు చెప్పిస్తాం. అసహాయస్థితిలో ఉన్న 500 మంది జర్నలిస్టులకు రూ.50 వేల చొప్పున సహాయం చేస్తున్నాం. కరోనా సోకిన 1950 మంది జర్నలిస్టులకు రూ.20 వేల చొప్పున సాయం అందించాం. 5,900మంది జర్నలిస్టులకు వివిధ జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇప్పించుకున్నాం. రూ.15 కోట్లు కేటాయించి సకల హంగులతో ఐదు అంతస్థులతో మీడియా భవనాన్ని నిర్మిస్తున్నాం. త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభించుకుంటాం. జర్నలిస్టులకు తెలంగాణలో ఇచ్చినట్టు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అక్రెడిటేషన్లు ఇచ్చారా? మనకంటే రెండింతలున్న గుజరాత్‌లో ఉన్నది వెయ్యి అక్రెడిటేషన్లే. అదే తెలంగాణలో 19,150. ఇదే కాకుండా 61,500 హెల్త్‌కార్డులు ఒక్క జర్నలిస్టులకే ఇచ్చినది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. ఆరున్నరేండ్లలో రూ.25 కోట్ల విలువైన సర్జరీలు చేయించాం’ అని చెప్పారు. టీయూడబ్ల్యూజేకు అత్యున్నత ప్రమాణాలతో సొంతభవనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ‘ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి అతిత్వరలోనే నిర్ణయం తీసుకుందాం’ అని చెప్పారు.


టీఆర్‌ఎస్‌ గెలిస్తే వార్త కాదా?
టీఆర్‌ఎస్‌ గెలిస్తే కొన్ని పత్రికలకు వార్త కాదు. టీఆర్‌ఎస్‌ ఓడిపోతే వాటికి సంచలనం.. అదో బీభత్సమైన వార్త అని కేటీఆర్‌ విమర్శించారు. ‘2014 నుంచి 2021 దాకా ఏడేండ్లలో పార్లమెంట్‌ నుంచి పంచాయతీ దాకా అన్ని ఎన్నికల్లో గెలిచాం. కొన్ని పత్రికలకు అదేమీ వార్తకాదు. దుబ్బాకల 500 ఓట్లతోని బీజేపీ గెలిస్తే అబ్బబ్బబ్బా.. ఏమి నీల్గుడు.. ఏమి ఎగురుడు! గంత పైశాచిక ఆనందమా? జీహెచ్‌ఎంసీ ఎన్నికల్ల ఏం పొడిసిన్రు? 56 టీఆర్‌ఎస్‌కొచ్చినవి. 44 వాళ్లకొచ్చినయ్‌. ప్రభుత్వం రేపు పడిపోతది అంటరు. మా మీద ఎగిరేటోళ్లు రెండింటికే గింత నీల్గితే.. మరి మేమెంత నీల్గాలె? మేమెంత విజయగర్వంతోని పొంగిపోయి ఆగమాగం కావాలె’ అని ప్రశ్నించారు.
మేం మాట్లాడలేకనా?
‘తెలంగాణ రాకముందు ఒక్కొక్కరినీ మాటలతోని బట్టలిప్పిండు కేసీఆర్‌. యాజ్జేసుకోండి’ అని బీజేపీ నాయకులకు కేటీఆర్‌ సూచించారు. ‘మాటలతోనే చీల్చి చెండాడాలంటే కేసీఆర్‌కు మించి ఆ పని ఇంకెవడూ చేయలేడు. కేసీఆర్‌ మాట్లాడుడు మొదలుపెడితే ఎవడూ సరిపోడు’ అని హెచ్చరించారు. ‘గోడకేసి ఉన్న తుపాకీ కూడా మౌనంగనే ఉంటది. తీస్తే దాని కథేందో తెలుస్తది. మేం మాట్లాడలేకనా! మర్యాద కోసం చూస్తున్నం. కేసీఆర్నే పట్టుకొని బట్టెబాజ్‌ అంటడు. ఎంతధైర్యం? ఆయన వయస్సేంది.. ఆయన హోదా ఏంది? ఆయన అనుభవమేంది? నీ అనుభవమేంది? తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రేంది? నీ పాత్రేంది? ఎక్కడున్నవ్‌ నువు? అడ్రస్‌ లేనోడు కూడా ఎటుపడితే అటే మాట్లాడతడు. ఎన్ని గుండెలు కావాలె మీకు.. ఎంత ధైర్యం? మోదీ గురించి, అమిత్‌షా గురించి మేం మాట్లాడలేమా? వాళ్ల వయస్సు, హోదా, ప్రధాని, హోంమంత్రి పదవుల్లో ఉన్నరు.. సంస్కారవంతంగా ఉన్నం. ఆగుతున్నం. నాకూ, హరీశ్‌రావుకు.. ఈటల రాజేందర్‌కు.. ఇంకా చాలామందికి కేసీఆర్‌ ట్రైనింగ్‌ ఇచ్చిండు. మేం మాట్లాడుడు మొదలుపెడితే తట్టుకోలేరు బిడ్డా’ అని తీవ్రంగా హెచ్చరించారు.
బరాబర్‌ 50వేల ఉద్యోగాలను భర్తీ చేస్తం
ఉద్యోగాలు భర్తీ చేయలేదని బీజేపీ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. ‘రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఎస్‌పీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌, సింగరేణి.. ఇలా ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో అన్నీ కలిపి 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం. దీనిపై శ్వేతపత్రం ప్రకటిస్తే.. మాట మార్చి మరీ ‘మస్తు ఖాళీలున్నయి’ అంటున్నరు. ఖాళీలున్నయ్‌. 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తమని చెప్పినం. వాటిని కూడా బరాబర్‌ నింపుతం’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.
జర్నలిస్టుల సమస్యలు అడిగిన ఏకైక సీఎం కేసీఆర్‌ : అల్లం నారాయణ
కాంగ్రెస్‌ ప్రభుత్వం మీడియా అకాడమీకి కోటి అడిగితే పైసా ఇవ్వలేదని, సీఎం కేసీఆర్‌ మాత్రం పది కోట్లు అడిగితే వంద కోట్లు ఇచ్చారని రాష్ట్ర మీడి యా అకాడమీ చైర్మన్‌, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ చెప్పారు. ప్రగతిభవన్‌ కట్టి న తర్వాత తొలి సమావేశం మరణించిన జర్నలిస్టు కుటుంబసభ్యులతో జరపడం సీఎం మంచి మనసుకు నిదర్శనమన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫో రం ఏర్పడి రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్న సందర్భంగా.. మే 31న నిర్వహించే సభకు ముఖ్యఅతిథి గా హాజరు కావాలని కేటీఆర్‌ను కోరారు. కొట్లాడి, సాధించికున్న తెలంగాణ ఫలాలు సీఎం కేసీఆర్‌ సారధ్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్లే అందుతున్నాయని ఎమ్మెల్యే చంటి కాంత్రికిరణ్‌ పేర్కొన్నారు. సమావేశంలో టీయూడబ్ల్యూజే నాయకులు మారుతీసాగర్‌, రమణ, వెంకట్‌, బీఆర్‌ లెనిన్‌, కవిత, ఇస్మాయిల్‌, సూరజ్‌ భరద్వాజ్‌, శ్రీకాంత్‌రెడ్డి, వంశీ తదితరులతోపాటు వివిధ జిల్లాల జర్నలిస్టు ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. ఇటీవల మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా చెక్కులు పంపిణీ చేశారు. 73 మంది కుటుంబాలు రూ.లక్ష చొప్పున. అసహాయస్థితిలో ఉన్న 18 మంది జర్నలిస్టులకు రూ.50వేల చొప్పు న చెక్కులు అందజేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement