బ్రెసిలియా: బ్రెజిల్‌కు చెందిన రాఫెల్ జుగ్నో బ్రిడి, అరుదైన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. 6,326 అడుగుల (1.901 మీటర్లు) ఎత్తులో గాల్లో తాడుపై నడిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బ్రెజిల్ శాంటా కాటరినాలోని ప్రియా గ్రాండే పైన ఈ ఫీట్ చేశాడు. ప్రపంచంలోనే ఎత్తైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాకు రెండింతల ఎత్తులో గాల్లో ఎగురుతున్న రెండు హాట్ బెలూన్ల మధ్య ఉన్న 25 సెంటీమీటర్ల తాడుపై ఒట్టి పాదాలతో నడిచి రికార్డు సృష్టించాడు. నమ్మశక్యం కాని సాహసోపేతమైన ఫీట్ అని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ (జీడబ్ల్యూఆర్) కొనియాడింది. రాఫెల్ జుగ్నో బ్రిడి అత్యంత ఎత్తులో గాల్లో తాడుపై ఒంటరిగా స్వేచ్ఛగా నడిచినట్లు తెలిపింది. ఇలాంటి సాహసం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదని పేర్కొంది.
మరోవైపు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రాఫెల్ జుగ్నో బ్రిడి అరుదైన ఫీట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అరుదైన, సాహసోపేతమైన ఫీట్ చేసి గిన్నీస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న ఆయనను నెటిజన్లు అభినందించారు. బ్రిడి చేసిన సాహసంపై నోరెళ్లబెట్టారు. ‘ఈ వీడియో చూస్తూనే నా కాళ్లు వణుకుతున్నాయి’ అని ఒకరు, చాలా గొప్ప ఫీట్ చేశారని మరి కొందరు కొనియాడారు. నమ్మశక్యం కాని ఫీట్ చేసిన బ్రిడి ఆత్మస్థైర్యం, ధైర్యం, సాహసాన్ని పలువురు ప్రశంసించారు.