న్యూఢిల్లీ: లోతైన బావిలో పడిన చిరుత పులిని అటవీ శాఖ సిబ్బంది కాపాడారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద శనివారం ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అటవీ శాఖ సిబ్బంది మంచానికి తాళ్లు కట్టి బావిలోకి దించుతారు. చిరుత ఆ మంచంపైకి చేరగానే తాళ్ల సహాయంతో పైకి లాగుతారు. దీంతో మంచంపై ఉన్న ఆ చిరుత బావి గట్టుపైకి దూకి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ‘మరో రోజు. తెరిచి ఉన్న బావిలో పడిన మరో చిరుతను మొహెంజో దారో హరప్పా సాంకేతికతను ఉపయోగించి రక్షించారు. జంతువుల ఆవాసాల చుట్టూ ఉన్న బహిరంగ బావులను మూసివేసినప్పుడే ఇలాంటివి ఆగిపోతాయి’ అని అందులో పేర్కొన్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది అన్నది వెల్లడించలేదు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే సుమారు 50 వేల మంది దీనిని చూశారు. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ఓపెన్ బావులపై జల్లెడ మాదిరి మూతలు అమర్చితే జంతువులతోపాటు మనుషులకు కూడా ఇలాంటి ప్రమాదాలు తప్పుతాయని కొందరు పేర్కొన్నారు. దీనిని మిషన్ మోడ్లో చేపట్టాలని సూచించారు. అలాగే అటవీశాఖ దీనికి చొరవ చూపాలని, పర్యావరణ మంత్రిత్వ శాఖతో కలిసి ఓపెన్ బావులకు పైమూతలు అమర్చడంపై దృష్టి సారించాలని కోరారు.
Another day.
Another rescue of leopard from open well using the Mohenjo Daro Harappan technology.
This will stop only when we close the open wells around animal habitat. pic.twitter.com/kvmxGhqWlf— Susanta Nanda IFS (@susantananda3) June 25, 2022