జైపూర్: ‘అందరి పిల్లలు తాగుతారు, అంతమాత్రానికే అరెస్ట్ చేస్తారా..?’ అంటూ రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కన్వర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. జోధ్పూర్కు చెందిన పోలీసులు ఆదివారం రాత్రి డ్రంకన్ డ్రైవ్ నిర్వహించగా పలువురు తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వాళ్లలో రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కన్వర్ మేనల్లుడు కూడా ఉన్నాడు.
నిందితులందరితోపాటు పోలీసులు ఎమ్మెల్యే మీనా కన్వర్ మేనల్లుడిని కూడా స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న మీనా కన్వర్ వెంటనే తన భర్త, అనుచరులతో కలిసి స్టేషన్కు వెళ్లారు. తన మేనల్లుడిని విడిచిపెట్టాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వినకపోవడంతో స్టేషన్లోనే బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీనా కన్వర్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.
‘పిల్లలు అన్నప్పుడు తాగుతారు. అందరి పిల్లలు తాగుతారు. అంత మాత్రానికే అరెస్ట్ చేస్తారా..?’ అని మీనా కన్వర్ వ్యాఖ్యానించారు. తన మేనల్లుడిని వెంటనే వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అటు ఎమ్మెల్యే భర్త ఉమ్మెద్ సింగ్ రాథోడ్ కూడా.. ఎమ్మెల్యే కింద కూర్చుంటే నువ్వు కుర్చీలో ఎలా కూర్చుంటావ్ అంటూ ఎస్ఐతో వాదనకు దిగాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. అందరి పిల్లలు తాగుతారంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
This is #Rajasthan's law & order situation under #Congress, Congress MLA Meena Kanwar from #Shergarh Constituency & her husband Umaid Singh gave open threats to Police Inspector just because he challaned her nephew in drink and drive case.#Jodhpur pic.twitter.com/vCFDTZDP8P
— Motivism (@Motivism) October 19, 2021