Gujarat : పరీక్షలో పాస్ కావడానికి కొందరు హైటెక్ కాపీయింగ్‌తో పాటు రకరకాల జిమ్మిక్కులు చేస్తారు. సినిమాల్లో మాదిరిగా ఒకరి బదులు ఒకరు పరీక్షకు హాజరై ఇన్విజిలేటర్లకు మస్కా కొడతారు. గుజరాత్లో అచ్చం అలాంటి సంఘటనే జరిగింది. బాయ్‌ఫ్రెండ్ బదులు పరీక్ష రాస్తూ ఒక యువతి పట్టుబడింది. బీకామ్ మూడో సంవత్సరం పరీక్షలకు డమ్మీ క్యాండెట్‌గా 24 ఏళ్ల అమ్మాయి హాజరైంది. అయితే.. అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్లు ఆమెను ప్రశ్నించారు. ‘ఆ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్ బదులు పరీక్ష రాస్తున్నట్టు గమనించాం. వాళ్లిద్దరూ స్కూల్ డేస్ నుంచి స్నేహితులని తెలిసింది. అయితే.. ఆమె డమ్మీగా ఎగ్జామ్ రాస్తున్న విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియదు’ అని అధికారులు తెలిపారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ టూర్లో ఉన్నాడు. దాంతో, తాను ఎగ్జామ్‌కు వచ్చినట్టు ఆ యువతి చెప్పింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని వీర్ నమద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీకి కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు చేశారు.
అయితే.. అసలు ఆ యువతిని పరీక్షా హాలులోకి ఎలా అనుమతించారు? అనే సందేహం అధికారులకు వచ్చింది. ఈ విషయం అడగ్గా.. ‘కంప్యూటర్ సాయంతో హాల్‌టికెట్‌లో మార్పులు చేశాను. ఆ తర్వాత ప్రింటవుట్ తీసుకున్నా’ అని ఆ అమ్మాయి చెప్పింది. హాల్‌టికెట్ చెక్ చేసిన ఎగ్జామినర్ కూడా ఆమె డమ్మీ క్యాండెట్ అనే విషయం పసిగట్టలేదు. ఎందుకంటే.. ప్రతిరోజు ఇన్విజిలేటర్ మారుతారు. అయితే.. అదే హాలులో పరీక్ష రాస్తున్న ఒక విద్యార్థి ఆ సీటులో అబ్బాయి బదులు అమ్మాయి కూర్చోవడం గమనించి, ఇన్విజిలేటర్‌కు ఫిర్యాదు చేశాడు. దాంతో, అసలు విషయం బయటపడింది.