Name Ceremony | అబ్బా.. పేరు ఎంత బాగుందో..
అదేం పేరు నోరే తిరుగుతలేదు..
అరే తాత పేరు కలిసొచ్చేటట్టు పెట్టినట్టుండ్రు..
ఆలుమగల పేర్లతో కలిసి పేరు పెట్టిండ్రు.. ఎంత ముద్దుగుందో..
శిశువు పుట్టిన 21 రోజులకు నిర్వహించే తొట్టెల కార్యక్రమానికి వచ్చిన బంధువుల నోట వినిపించే మాట ఇది.. చర్చించే అంశం ఇదే. అందుకే ఆ పేరు పెట్టేందుకు కొత్తగా ఆలోచిస్తున్నారు నేటితరం తల్లిదండ్రులు. తల్లిదండ్రుల ఇద్దరు పేర్లలోని అక్షరాల నుంచి తీసిన అక్షరాలతో పిల్లల పేర్లు పెడుతుండటం నయా ట్రెండ్‌గా మారింది. పిల్లలకు పేర్లు పెట్టేందుకు పేరెంట్స్ పెద్ద కసరత్తే చేస్తున్నారు. రోజుల తరబడి శోధిస్తున్నారు. పెట్టే పేరు కొత్తగా ఉండాలని ఆలోచిస్తున్నారు. పది మంది నచ్చాలని భావిస్తున్నారు. ప్రతి ఒక్కరి నోట నలిగేలా ఉండాలని చూస్తున్నారు.
పిల్లలు పుట్టిన సమయం, గ్రహాలు, నక్షత్రాలు ఇలా అన్ని వివరాలు తీసుకుని తల్లిదండ్రులు ముందుగా బ్రాహ్మణుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఆయా నక్షత్రాల ప్రకారం ఏ అక్షరాలతో పేరు పెట్టాలో చెప్పాలని కోరుకుంటున్నారు. బ్రాహ్మణులు అక్షరాలు ఇచ్చింది మొదలు.. కొత్త పేర్ల కోసం శోధన మొదలు పెడుతున్నారు. బిడ్డ పుట్టింది మొదలు 21 రోజులకు పేరు పెట్టే వరకు పెద్ద కసరత్తే చేస్తున్నారు. సమీప బంధువులు, స్నేహితులతో చర్చలు మొదలుపెడుతున్నారు. బ్రాహ్మణులు అందజేసిన అక్షరాలతో ఇప్పటికే ఏయే పేర్లు ఉన్నాయో జాబితా సిద్ధం చేస్తున్నారు. ఇంటర్నెట్లో విపరీతంగా శోధిస్తున్నారు. ఆయా అక్షరాలతో తాత ముత్తాతల పేర్లు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఆపై అందరితో చర్చలు జరిపి.. అందులో నచ్చిన వందకు పైగా పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేస్తున్నారు.
ఆయా పేర్ల అర్థాలను తెలుసుకుంటున్నారు. పేర్లు, వాటి అర్థాల గురించి పెద్దలతో చర్చిస్తున్నారు. ప్రధానంగా తల్లిదండ్రుల ఇద్దరి పేర్లలోని అక్షరాలు వచ్చేలా ప్రాధాన్యమిస్తున్నారు. అన్ని రకాల బాన్నదా అని అన్ని విధాలా ఆలోచిస్తున్నారు. జాబితాపై చర్చల అనంతరం పిల్లల పేరును ఫైనల్ చేస్తున్నారు. అందులోనూ సంఖ్యాశాస్త్రం ప్రకారం వారికి ఎలా ఉంటుందనే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నారు. ఇందుకోసం జాతకాలు చూయిస్తున్నారు. అవే పేర్లను ఆంగ్లంలో రాసేటప్పుడు ఎన్ని అక్షరాలు ఉండేలా చూసుకోవాలో కూడా సూచనలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు.. పాప పేరు శ్రియాన్షి అనుకుంటే తెలుగులో ఇలా రాస్తారు. దాన్నే ఇంగ్లిష్‌లో రాయాల్సి వచ్చినప్పుడు శ్రి అనే పదాన్ని ఎస్ఆర్ఐ రాయాలా లేదా ఎస్హెచ్ఆర్ఐ రాయాలా అన్న సమయంలో సంఖ్యాశాస్ర్తాన్ని ఫాలో అవుతున్నారు.
మనవడు అచ్చం తాత పోలిక.. ఆయన పేరే పెడతరంట. దశాబ్దం కిందట వరకు ఈ మాట ఎక్కువగా వినిపించేది. కొడుకు పుడితే తాత పేరు పెడతామని ముందే నిర్ణయించుకున్నవారూ ఉన్నారు. వంశోద్ధారకుడు జన్మిస్తే తాత పేరు కలిసొచ్చేలా నామకరణం చేస్తామని చెప్పేవారూ లేకపోలేదు. కాకపోతే ఆ పేర్లలోని అక్షరాలు తీసుకుని ట్రెండీగా పేరు మార్చేస్తున్నారు. ఉదాహరణకు.. తాత పేరు ఆశిరెడ్డిగా ఉంటే.. ఆశిష్రెడ్డిగానో, ఆయుష్రెడ్డిగానో, ఆయాన్ష్రెడ్డి ఇలా.. ఇంకా ట్రెండీగా పేరు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మనవడికి ‘మా తాత పేరే పెట్టాను’ అని గర్వంగా చెప్పుకొనేవారెందరో ఉంటారు. తాత, అమ్మమ్మ, నానమ్మల పేర్లు కలిసేలా పిల్లలకు నామకరణం చేసేందుకు ఎంతో కొంతమంది ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు, తమ ముందే ఉన్నతస్థాయికి ఎదిగిన స్నేహితుల పేర్లు సైతం తమ పిల్లలకు పెట్టుకునేందుకు కొంతమంది తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు.
చాలామంది దేవుళ్ల పేర్లు పిల్లలకు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంకొందరు మహారుషులు, గొప్ప వ్యక్తుల పేర్లు పిల్లలకు పెట్టాలని భావిస్తున్నారు. మరికొందరు సంస్కృత శ్లోకాల్లోని పదాలను పేర్లుగా పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. ఇటీవల ఓ హీరో తన కుమార్తెకు క్లింకార అనే పేరు పెట్టారు. చిన్నస్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన నాయకులు, అధికారుల పేర్లను తమ పిల్లలకు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏది ఏమైనా.. పిల్లలకు పేరు పెట్టేందుకు నేటితరం తల్లిదండ్రులు పెద్ద యుద్ధమే చేస్తున్నారనడంలో సందేహం లేదు.