Viral News | తాను వేరే మహిళతో ఉండటాన్ని గుర్తించిన భార్యను కారుతో ఢీ కొట్టాడు ఓ సినీ నిర్మాత. ఈ ఘటన ముంబయిలోని అంబోలీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయమై బాధితురాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈనెల 19వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబయికి చెందిన సినీ నిర్మాత కమల్ కిషోర్ మిశ్రాకు పెళ్లైంది. ఇటీవల ఒక రోజు అతడు ఇంట్లో కనిపించకపోయే సరికి.. భార్య అతని కోసం వెతుక్కుంటూ వెళ్లింది. ఈ క్రమంలో పార్కింగ్ ప్రదేశంలో కారులో అతన్ని గుర్తించింది. అయితే అతనితోపాటు మరో మహిళ ఉండటాన్ని చూసి దగ్గరకెళ్లి నిలదీశింది. భార్య నుంచి తప్పించుకునే క్రమంలో ఎదురుగా ఉన్న ఆమెను పట్టించుకోకుండా అతను కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో ఆమె తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పలువురు బాధితురాలిని కాపాడారు.
ఈ ఘటనపై బాధితురాలు అంబోలీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిర్మాతపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.