Elephant | సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వింత ఘటనలు మనకు తారసపడుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పించేవి కాగా.. మరికొన్ని బాధ కలిగించేవిగా ఉంటాయి. తాజాగా ఏనుగుకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కేరళలోని కుంభకోణం శ్రీ కుంభేశ్వర స్వామి ఆలయంలో ఓ ఏనుగు తన సంరక్షకుడి ఫోన్ చూసేందుకు ఎంతో కష్టపడుతున్నట్లుగా ఉన్న ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
వీడియోలో ఏముందంటే…. కుంభకోణం ఆలయ ప్రాంగణంలో ఓ మావటి ఒక చోట కూర్చొని ఫోన్ చూస్తుంటాడు. ఓ ఏనుగు మావటి ఫోన్ చూస్తుండటాన్ని గమనించి అక్కడికి వస్తుంది. అది కూడా ఫోన్ చూసేందుకు చాలా ప్రయత్నిస్తుంది. అయితే, ఏనుగు చాలా పెద్దది కావడంతో ఫోన్ కనిపించదు. దీంతో అది వంగి వంగి చూస్తుంటుంది. అయినప్పటికీ మావటి ఫోన్ ఏనుగుకు కనిపించదు. దీంతో తొండం సాయంతో కాస్త కిందకు వంగి చూసేందుకు ప్రయత్నిస్తుంది. కేరళ ఎలిఫెంట్స్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.