అబ్బాయిది ఇండియా.. అమ్మాయిది ఉక్రెయిన్. మూడేళ్ల క్రితం ఓ ప్రయాణంలో కలుసుకున్నారు. మొదట మాటలు కలిశాయి. ఆ తర్వాత మనసులు కలిశాయి. అంతలోనే కరోనా వచ్చింది. విమాన సేవలు నిలిచిపోయాయి. దీంతో ఆ అమ్మాయి.. ఇండియాలోని అబ్బాయి ఇంట్లోనే ఉండిపోయింది. ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కరోనా లాక్డౌన్ ఎత్తివేయగానే ఆ అమ్మాయి ఉక్రెయిన్ వెళ్లిపోయింది. ఈలోగా ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైంది. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురుస్తున్నది. అయినా ఆమె బెదరలేదు. ధైర్యంగా ఇంటినుంచి బయలుదేరి ఇండియా చేరుకుంది. యుద్ధ సమయంలోనూ ప్రేమ గెలిచింది.
అనుభవ్ భాసిన్ (33) ఢిల్లీకి చెందిన న్యాయవాది. ఉక్రెయిన్‌కు చెందిన అన్నా హోరోడెట్స్కా (29) ఐటీ ఉద్యోగి. ఈ ఇద్దరూ మూడేళ్ల క్రితం ఓ విమాన ప్రయాణంలో మొదటిసారి కలుసుకున్నారు. అతికొద్దిరోజుల్లోనే వారి మసనులు కలిశాయి. ప్రేమికులుగా మారిపోయారు. మొదటి లాక్డౌన్ సమయంలో విమానాలు రద్దుకావడంతో అన్నా ఇండియాలోనే ఇరుక్కుపోయింది. లాక్డౌన్ రోజుల్లో అనుభవ్ ఇంట్లోనే ఉంది. అప్పుడు వాళ్లు మరింత దగ్గరయ్యారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెద్దలను కూడా ఒప్పించారు.
అయితే, కరోనా లాక్డౌన్ ముగియగానే, విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. అన్నా తిరిగి తన దేశం ఉక్రెయిన్‌కు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ దుబాయ్‌లో కలుసుకున్నారు. అనంతరం ఒకసారి అన్నా ఇండియా వచ్చింది. అనుభవ్ కూడా అన్నా స్వస్థలం కీవ్ వెళ్లి వచ్చాడు. ఓ మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకుందామని అనుకున్నారు.
ఫిబ్రవరి 24, 2022న అకస్మాత్తుగా రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది. కీవ్‌పై బాంబుల వర్షం కురుస్తోంది. ఆ రోజు అన్నా బాంబుల శబ్ధంతోనే మేల్కొంది. అనంతరం మూడు రోజులు బాంబు షెల్టర్‌లోకి వెళ్లిపోయింది. అప్పుడు ఆమెకు అనుభవ్ గుర్తుకొచ్చాడు. తన ప్రేమను ఎలాగైనా బతికించుకోవాలనుకుంది. ఫిబ్రవరి 27న ఆమె తన తల్లి, కుక్కతో కలిసి ఇంటి నుంచి బయలుదేరింది. తన అమ్మమ్మ ఉండే పోలండ్‌కు వెళ్లాలని నిశ్చయించుకుంది.
తన స్వస్థలం నుంచి కమియాంక వైపు రైలులో బయలుదేరింది. ఉక్రెయిన్‌కు పశ్చిమాన, పోలిష్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఎల్వివ్ వైపు వెళ్లే రైలు కోసం రెండు గంటలు వేచి చూసింది. ఆ రోజు రాత్రి ఎల్వివ్‌లో బస చేసింది. అయితే, పోలండ్ సరిహద్దు వద్ద అప్పటికే ప్రజలు 24 గంటలు క్యూలో ఉన్నారని తెలిసింది. దీంతో ఆమె స్లొవేకియా సరిహద్దుకు వెళ్లే బస్సు ఎక్కింది. అనంతరం రెండు గంటలపాటు నడిచి సరిహద్దు దాటింది. అక్కడినుంచి మినీ బస్సులో పోలాండ్లోని క్రాకోవ్‌కు వెళ్లింది. అక్కడే స్నేహితుల వద్ద రెండు వారాలపాటు ఉంది.
చివరగా ఆమె ఇండియాలోని అనుభవ్ వద్దకు వచ్చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా పోలాండ్లోని భారత రాయబార కార్యాలయంలో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నది. వీసా రాగానే ఢిల్లీలో వాలిపోయింది. ఢిల్లీలో ఫ్లైట్ దిగగానే ఆమెను చూసి అనుభవ్ భావోద్వేగంతో కంటతడిపెట్టుకున్నాడు. అక్కడే మరోసారి లవ్ ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం ఆమె వీసా గడువు ఏడాదిపాటు ఉందని,. త్వరలోనే అన్నా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోనుందని అనుభవ్ తెలిపాడు. అనంతరం ఇద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పాడు. యుద్దం ముగిశాక ఉక్రెయిన్‌కు వెళ్లి కుక్కను ఇక్కడికి తెచ్చుకుంటామని అనుభవ్ పేర్కొన్నాడు.