తిరువనంతపురం: కేరళకు చెందిన ఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ బీ రవిపిళ్లై రూ. 100 కోట్ల విలువైన ఎయిర్‌బస్ హెచ్- 145 హెలికాప్టర్‌ను కొనుగోలు చేశాడు. ఇంత లగ్జరీ చాపర్‌ను సొంతం చేసుకున్న మొదటి భారతీయుడిగా నిలిచారు. ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,500 హెచ్-145 చాపర్లు మాత్రమే తిరుగుతున్నాయి. కాగా, ఆదివారం ఈ హెలిక్యాప్టర్‌లో ఆర్పీ గ్రూపస్ వైస్ చైర్మన్.. కోవలం నుంచి ది రవిజ్ అష్టముడి ఫైవ్‌స్టార్ హోటల్వరకు ప్రయాణించారు.
68 ఏళ్ల బిలియనీర్ బీ రవిపిళ్లై సంపద విలువ ప్రస్తుతం $2.5 బిలియన్ డాలర్లు. రవిపిళ్లైకి చెందిన వివిధ కంపెనీల్లో సుమారు 70,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆయన యూఏఈ నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
కాగా, హెచ్-145 హెలికాప్టర్ అత్యాధునిక భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో పైలెట్‌తోపాటు ఏడుగురు ప్రయాణికులు ప్రయాణించొచ్చు. ఈ హెలికాప్టర్ సముద్ర మట్టానికి 20,000 అడుగుల ఎత్తునుంచి కూడా ల్యాండింగ్, టేకాఫ్ చేయగలదు. కంపెనీకి రాష్ట్రవ్యాప్తంగా విలాసవంతమైన హోటల్స్ ఉన్నాయని, ఇది పర్యాటక కార్యకలపాలకు ఊతమిస్తుందని ఆర్పీ గ్రూప్స్ ఉన్నతాధికారి తెలిపారు.