ముంబై: భూమి మీద నూకలు మిగిలి ఉంటే మనం ఎదురెళ్లినా చావు వెనుకడుగు వేస్తుందంటారు. కొన్ని అనూహ్య సంఘటనలు చూసినప్పుడు అది నిజమేనేమో అనిపిస్తుంది. తాజాగా ఓ రైల్వేస్టేషన్లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. తాను వెళ్లాల్సిన రైలు కదిలిన తర్వాత ప్లాట్‌ఫామ్ దగ్గరికి చేరుకున్న ఓ ప్రయాణికుడు రన్నింగ్‌లో ఆ ట్రెయిన్ ఎక్కే ప్రయత్నం చేశాడు.
అయితే, చేత్తో రైలును అందుకుని కాలు రైలులోపల పెట్టకముందే ప్లాట్‌ఫామ్‌పై జారిపడ్డాడు. ఆ భయంలో ఎడమచేతితో రైలును, కుడి చేతితో బ్యాగును వదలకుండా బిగ్గరగా పట్టుకున్నాడు. రైలు దాదాపు 50 అడుగుల దూరం ఈడ్చుకెళ్లిన తర్వాత వదిలేశాడు. ఇంతలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన ఓ జవాన్ అది గమనించి పరుగున అతడిని చేరుకున్నాడు. రైలు దగ్గరి నుంచి దూరం లాగేసి ప్రాణాలు కాపాడాడు.
అయితే, ప్రయాణికుడి కుడిచేతిలో బ్యాగు లేకపోయి ఉంటే అతను తీవ్రంగా గాయపడేవాడు. ఎందుకంటే రైలు ఈడ్చుకెళ్లినంతసేపు అతని తలకింద బ్యాగు మెత్తలా ఉండిపోయింది. మహారాష్ట్రలోని వాసాయ్ రైల్వేస్టేషన్లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికుడిని కాపాడిన ఆర్పీఎఫ్ జవాన్‌ను రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో వీక్షించవచ్చు.
#WATCH | Maharashtra: An RPF (Railway Protection Force) jawan rescued a passenger who fell down on the railway platform while trying to board a moving train at Vasai Railway Station on 23rd January. pic.twitter.com/Pxy2u467ZJ
— ANI (@ANI) January 24, 2022