రెండు తలలు, రెండు వెన్నెముకలు, మూడు చేతులతో ఓ వింత శిశువు జన్మించింది. ప్రస్తుతం ఈ శిశువు ఐసీయూలో చికిత్స పొందుతున్నది. ఇది చాలా అరుదైన కేసని, ఆ శిశువు ఎక్కువకాలం జీవించలేదని వైద్యులు చెబుతున్నారు.
ఈ వింత శిశువు మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో జన్మించింది. తల్లి షాహీన్గా గుర్తించారు. ఆమె జిల్లాలోని జవ్రా (జావోరా) నివాసి. ఈ వింత శిశువును ఇండోర్‌లోని ఎంవై దవాఖానకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నది. ఈ దంపతులకు ఇదే మొదటి సంతానం.
షాహీన్ గర్భిణిగా ఉన్నప్పుడు తీసి సోనోగ్రఫీ రిపోర్టులో కడుపులో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉండొచ్చని వైద్యులు అంచనా వేశారు. కానీ పుట్టాక శిశువుకు రెండు తలలు, రెండు వెన్నుపాములు, మూడు చేతులున్నాయని పేర్కొన్నారు. ఇది చాలా అరుదైన కేసని, దీన్ని డైసెఫాలిక్ పారాపాగస్ అంటారని డాక్టర్ బ్రజేష్ లాహోటి తెలిపారు.
ఈ శిశువు మూడు కిలోల బరువుందని డాక్టర్ లాహోటి తెలిపారు. శరీరంలో కదలికలున్నాయని పేర్కొన్నారు. అయితే, చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు చెప్పారు. చాలావరకు డైసెఫాలిక్ కవలలు చనిపోయి పుడతారని, లేదా పుట్టాక చనిపోతారని తెలిపారు. చాలా తక్కువ సంఖ్యలో యుక్తవయస్సు వరకు జీవించి ఉన్నారని చెప్పారు.