Viral Video: మహరాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఒక గమ్మత్తైన ఘటన చోటుచేసుకుంది. చిరుతపులి బారి నుంచి తప్పించుకోబోయి పిల్లి, పిల్లిని వేటాడటం కోసం వెంబడించి చిరుతపులి రెండూ లోతైన బావిలో పడ్డాయి. నీళ్లలో పడిన వెంటనే పిల్లి బావిలోపలి గట్టుపైకి చేరింది. అంతకు మించి ఇక ఎటూ వెళ్లే దారిలేక చిరుతకు చిక్కినట్లేనని పిల్లి భయంతో వణికిపోయింది. ఇంతలో చిరుతపులి కూడా నీళ్లలోంచి బావిలోపలి గట్టుపైకి చేరింది. వచ్చీరావడంతోనే పిల్లిపై దాడికి యత్నించింది.
దాంతో గడగడ వణుకుతూనే పిల్లి రెండు కాళ్లపై నిలబడి ముందు కాళ్లతో చిరుతకు దండం పెట్టినంత పనిచేసింది. దాంతో పులి కూడా దాన్ని వేటాడకుండా వదిలేసింది. ఈ ఫన్నీ ఘటనకు సంబంధించిన 16 సెకన్ల నిడివిగల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పిల్లి భయంతో గడగడ వణికిపోవడం, చిరుత జాలిచూపడం నెటిజన్లను తెగ ఆకర్షిస్తున్నది. కింది వీడియోలో ఆ ఫన్నీ దృశ్యాలను మీరు కూడా వీక్షించండి..
కాగా, చివరికి గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను, పిల్లిని బావి నుంచి వెలికి తీశారు. అనంతరం చిరుతను సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. మహారాష్ట్రలోని నాసిక్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.