e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home Top Slides మహిళలో 32 మ్యుటేషన్లు!

మహిళలో 32 మ్యుటేషన్లు!

  • దక్షిణాఫ్రికాలోని హెచ్‌ఐవీ రోగిలో గుర్తింపు
  • బాధితురాలి శరీరంలో 216 రోజులుగా కరోనా
  • ఎయిడ్స్‌ రోగుల్లో కరోనాపై అధ్యయనం అవసరం
  • వీరు వేరియంట్లకు కర్మాగారాలుగా మారొచ్చు
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తలు
మహిళలో 32 మ్యుటేషన్లు!

కేప్‌టౌన్‌, జూన్‌ 6: కరోనా మహమ్మారి మాయదారి వేషాలు విస్మయపరుస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన ఓ ప్రత్యేక కేసు నిపుణులను సైతం షాక్‌కు గురిచేస్తున్నది. హెచ్‌ఐవీతో గత 15 ఏండ్లుగా బాధపడుతున్న ఓ మహిళ శరీరంలో 216 రోజులుగా కరోనా తిష్టవేసింది. అంతేకాదు ఆమె శరీరంలో అది 32 సార్లు ఉత్పరివర్తనాలకు లోనైనట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ కేసు గురించి ‘మెడ్‌ఆర్‌గ్జివ్‌’ మెడికల్‌ జర్నల్‌ ప్రముఖంగా ప్రచురించింది.

ఇతరులకు సోకిందా?
బాధిత మహిళకు 2006లో హెచ్‌ఐవీ సోకింది. అప్పటి నుంచి ఆమె ఒంట్లో రోగనిరోధక శక్తి క్షీణిస్తూ వస్తున్నది. గతేడాది సెప్టెంబర్‌లో ఆమె కరోనా బారిన పడింది. రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తుండటంతో వైరస్‌ పేట్రేగిపోయినట్టు పరిశోధకులు తెలిపారు. రోగి శరీరంలో మనుగడ సాగించే క్రమంలో స్పైక్‌ ప్రొటీన్‌లో 13 ఉత్పరివర్తనాలు, మరో 19 జన్యుక్రమ మార్పులకు వైరస్‌ లోనైందని, ఇలా మొత్తం 32 ఉత్పరివర్తనాలకు గురైనట్టు వెల్లడించారు. బ్రిటన్‌లో వెలుగుచూసిన ఆల్ఫా వేరియెంట్‌, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన బీటా వేరియెంట్లు కూడా ఆమె శరీరంలో గుర్తించినట్టు పేర్కొన్నారు. ఆమె ద్వారా ఈ వేరియెంట్లు ఇతరులకు సోకాయా, లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదన్నారు. అయితే, క్వాజులూ నటాల్‌ ప్రాంతంలో ప్రతీ నలుగురు హెచ్‌ఐవీ రోగుల్లో ఒకరికి కొత్త వేరియెంట్‌ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు.

అలా తిష్టవేసింది!
సాధారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లలో కరోనా ఎక్కువ కాలం ఉంటుంది. హెచ్‌ఐవీ అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో ఉన్న రోగుల్లోనూ ఇది జరుగుతుంది. ప్రస్తుత కేసులో బాధిత మహిళ హెచ్‌ఐవీ అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో ఉన్నారు. కరోనా సోకినప్పుడు ఆమెకు తేలికపాటి లక్షణాలే కనిపించినట్టు పరిశోధకులు తెలిపారు. అయితే అప్పటి నుంచి వైరస్‌ ఆమె శరీరంలో సజీవంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని డర్బన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ క్వాజులూ నటాల్‌ ప్రొఫెసర్‌, జన్యు శాస్త్రవేత్త టులియో డె ఒలివెయిరా తెలిపారు. ఈ కేసును మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించారు. హెచ్‌ఐవీ అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో ఉన్నవారిలో ఇలాంటి కరోనా కేసులు ఇంకా పెరిగితే, అలాంటి వారు ప్రపంచంలో వైరస్‌ వేరియంట్లకు కర్మాగారాలుగా మారుతారని ఆందోళన వ్యక్తం చేశారు.

అలా అయితే మనకూ కష్టమే!
హెచ్‌ఐవీ రోగులకు కరోనా సోకితే జరిగే పరిణామాల్లో ఈ కేసు కొత్త కోణాన్ని ఆవిష్కరించిందని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనతో హెచ్‌ఐవీ బారినపడ్డవాళ్లు.. మరిన్ని రకాల కరోనా వేరియంట్లను వ్యాపింపజేసే ప్రమాదముందన్న వాదనకు బలం చేకూరినట్లయిందని చెబుతున్నారు. ‘హెచ్‌ఐవీ బారినపడ్డవాళ్లను గుర్తించి, వారిలో రోగనిరోధక శక్తి పెంపొందించేలా మందులు, పోషకాహారం అందించాలి. ఒకవేళ వాళ్లు కరోనా బారినపడితే త్వరగా చికిత్స అందించాలి’ అని టులియో చెప్పారు. భారత్‌లో మొత్తం 25 లక్షల హెచ్‌ఐవీ రోగులు ఉండగా, అందులో సుమారు పది లక్షల మందికి సరైన చికిత్స అందట్లేదని, వీళ్లకు గనుక కరోనా సోకితే పరిస్థితి దిగజారొచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మహిళలో 32 మ్యుటేషన్లు!

ట్రెండింగ్‌

Advertisement