హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. మంగళవారం (ఈ నెల 27) నుంచి మే 31 వరకు సెలవులు ఇస్తున్నట్టు వెల్లడించింది. సోమవారమే ఈ విద్యాసంవత్సరం ఆఖరు పనిదినంగా పేర్కొన్నది. పాఠశాలలు, జూనియర్ కాలేజీలను మళ్లీ ఎప్పుడు తెరిచే అంశంపై జూన్ 1న నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. 1-9 తరగతుల విద్యార్థులందరినీ పరీక్షల్లేకుండానే పై తరగతులకు ప్రమోట్చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు వేసవి సెలవుల అంశంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వేసవి సెలవులు ప్రకటిస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన విడుదల చేశారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఇప్పటికే విద్యాసంస్థలను మూసివేయగా, ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులంతా ఒంటిపూట బడులకు హాజరవుతూ ఆన్లైన్లో క్లాసులు చెప్తున్నారు. సెలవుల ప్రకటనతో ఆన్లైన్ క్లాసులను నిలిపివేయనున్నారు. సోమవారంతో విద్యా సంవత్సరం ముగియనున్నది.
53.79 లక్షల మంది పాస్
రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 9వ తరగతివరకు విద్యార్థులను ప్రభుత్వం నేరుగా పైతరగతులకు ప్రమోట్‌చేసింది. దీంతో 53,79,388 మంది పరీక్షల్లేకుండానే పైతరగతులకు వెళ్లారు. ఇప్పటికే సర్కారు పది పరీక్షలను రద్దుచేసి, పరీక్షఫీజు చెల్లించిన 5,21,392 మందిని పాస్‌చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ఇంటర్‌బోర్డు కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఆదివారం వేర్వేరు ఉత్తర్వులు జారీచేశారు. జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించడం పట్ల ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం తెలంగాణ స్టేట్, తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టీఐపీఎస్) నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న, టీఐపీఎస్ రా్రష్ట్ర కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పశెట్టి సురేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సెలవుల్లోనే కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలు చేపట్టాలని గాదె వెంకన్న కోరారు.
వేసవి సెలవుల పట్ల ఇంటర్ విద్యాజేఏసీ హర్షం
జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించడం పట్ల ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పీమధుసూదన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కరోనా వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అధ్యాపకులకు తీవ్ర ఉశమనం కలిగించడమే కాకుండా, మానసిక ఒత్తిడిని తగ్గించిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్, విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డికి ఇంటర్ విద్యా జేఏసీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.