e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home Top Slides స్వరాష్ట్రంలో రహదారుల నిగనిగ

స్వరాష్ట్రంలో రహదారుల నిగనిగ

స్వరాష్ట్రంలో రహదారుల నిగనిగ
 • ఏడేండ్ల కాలంలో సాధించినవి 2,114 కిలోమీటర్ల ఎన్‌హెచ్‌లు
 • జాతీయ సగటును మించిన రాష్ట్రం
 • నిర్మాణ పనుల్లోనూ అదే జోరు
 • కేసీఆర్‌ పట్టుదలతోనే సుసాధ్యం: ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంతో పోల్చుకొంటే.. తెలంగాణ ఏర్పడిన తర్వాతనే జాతీయ రహదారుల నిర్మాణం వేగం పుంజుకున్నది. సీఎం కేసీఆర్‌ చొరవ, పట్టుదల కారణంగానే ఇది సాధ్యమైంది. జాతీయ సగటు కంటే అధికంగా అనుమతులు సాధించుకోవడమే కాకుండా, వాటి నిర్మాణంలోనూ అదే ఊపు కనిపిస్తున్నది. ఫలితంగా ప్రధాన రహదారులన్నీ నాలుగు, ఆరు లేన్లతో నిగనిగలాడుతున్నాయి. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో జాతీయ రహదారుల నిడివి 2,511 కిలోమీటర్లే. ఇప్పుడు ఇవి 4,626 కిలోమీటర్లు. ఈ ఏడాది చివరినాటికి మరో 417 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేయించుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఆ రోడ్లు యాక్టివ్‌ కన్సిడరేషన్‌లో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.

జాతీయ సగటు కంటే ఎక్కువగా..

సమైక్య రాష్ట్రంలో 100 చదరపు కిలోమీటర్ల ఏరియాకు 2.2 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేవి. ఇప్పుడు ఇవి 4.13 కిలోమీటర్లకు విస్తరించడం విశేషం. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. జాతీయస్థాయిలో 100 చదరపు కిలో మీటర్ల ఏరియాకు 4.06 కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారులున్నాయి.

నిర్మాణంలోనూ అదే స్పీడు

రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 4,626 కిలోమీటర్ల జాతీయ రహదారులు డిక్లరేషన్‌ కాగా ఇందులో 2,165 కిలోమీటర్లు ఆ స్థాయికి అభివృద్ధి చెందాయి. ఇందులో సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి చేసింది 831 కిలోమీటర్లే. మిగిలిన 1,334 కిలోమీటర్ల రహదారులను తెలంగాణ ఏర్పడిన తర్వాతనే పట్టుబట్టి, నిధులు సాధించి నిర్మించుకోవడం విశేషం. మరో 533 కిలోమీటర్లలో పనులు జరుగుతున్నాయి. 1,968 కిలోమీటర్ల పనులకు డీపీఆర్‌లు సమర్పించి, నిర్మాణ అనుమతులు తెచ్చారు. ఈ పనులను త్వరలో చేపట్టనున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రకటనలే..

దేశాన్ని, రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో 2,511 కిలోమీటర్ల జాతీయ రహదారులను డిక్లేర్‌ చేసింది. కానీ, వారు నిర్మించిన జాతీయ రహదారులు 831 కిలోమీటర్లే. వీటిలో ప్రధానంగా విజయవాడ- హైదరాబాద్‌- ముంబై, నాగపూర్‌- హైదరాబాద్‌- బెంగళూరు మినహా మరొకటి లేదు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ జాతీయ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు దేశవ్యాప్తంగా కనెక్టివిటీ పెరగాలంటే జాతీయ రహదారులను విస్తరించాలని భావించారు. అందుకు అనుగుణంగా డీపీఆర్‌లు రూపొందించారు. వాటికి ఎన్ని నిధులు, ఎంత భూమి అవసరమో లెక్కలేసి, పక్కా సమాచారంతో కేంద్రానికి వివరించారు.
సీఎం కేసీఆర్‌ స్వయంగా పలుసార్లు ప్రధాని మోదీని, ఉపరితల రవాణశాఖ మంత్రి నితిన్‌గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో అధికారుల మీద ఒత్తిడి తెచ్చేలా ఎంపీల బృందాన్ని పురమాయించారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని, జాతీయ రహదారులశాఖ కార్యదర్శి గిరిధర్‌ను కలిసి జాతీయ రహదారుల కోసం కృషి చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రోద్బలంతో నిరంతరం కొనసాగించిన ప్రయత్నాలకు ఫలితం లభిస్తున్నది.

ఈ ఏడాది మంజూరయ్యే అవకాశం ఉన్న రోడ్లు ఇవే..

 • కరీంనగర్‌-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం (165 కిలోమీటర్లు)
 • కొత్తకోట- మంత్రాలయం 70 కిలోమీటర్లు
 • దక్షిణ భాగం 182 కిలోమీటర్ల రీజినల్‌ రింగ్‌రోడ్డు

సాధించుకున్న జాతీయ రహదారులు ఇవే

 • వరంగల్‌-ఖమ్మం,
 • సూర్యాపేట- జనగామ- దుద్దెడ-సిద్దిపేట- సిరిసిల్ల
 • హైదరాబాద్‌-మెయినాబాద్‌-కొడంగల్‌ రోడ్డు,
 • మంచిర్యాల- చంద్రపూర్‌ రోడ్డు,
 • సగ్రోలి- బోధన్‌- నిజామాబాద్‌ జంక్షన్‌,
 • ఆదిలాబాద్‌-బేల-కొప్రానా రోడ్డు,
 • నిజాంపేట-నారాయణఖేడ్‌-న్యాల్‌కల్‌ రోడ్డు,
 • సూర్యాపేట- మోతె-ఖమ్మం- వైరా- సత్తుపల్లి- అశ్వారావుపేట రోడ్డు,
 • సంగారెడ్డి- నర్సాపూర్‌-తూప్రాన్‌- గజ్వేల్‌- ప్రజ్ఞాపూర్‌- జగదేవ్‌పూర్‌-భువనగిరి- చౌటుప్పల్‌,
 • నిర్మల్‌-ఖానాపూర్‌-రాయికల్‌- జగిత్యాల,
 • మద్నూర్‌- బోధన్‌,
 • హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌- నర్సాపూర్‌-మెదక్‌,
 • ఖమ్మం- దేవరపల్లి (గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు),
 • కల్వకుర్తి- కొల్లాపూర్‌-కరివెన,
 • మెదక్‌-ఎల్లారెడ్డి- రుద్రూర్‌,
 • బోధన్‌-బాసర-భైంసా,
 • మెదక్‌- సిద్దిపేట- ఎల్కతుర్తి,
 • వలిగొండ- తొర్రూరు- నెల్లికుదురు- మహబూబాబాద్‌- ఇల్లెందు-కొత్తగూడెం, తాండూర్‌- కొడంగల్‌- మహబూబ్‌నగర్‌ రోడ్డు.

స్వరాష్ట్రంలో సాధించుకున్న జాతీయ రహదారులు (కిలోమీటర్లలో)
ఆర్థిక సంవత్సరం కిలోమీటర్లు


2015-16 120
2016-17 735.1
2017-18 462.98
2018-20 ఇవ్వలేదు
2020-21 796.75
మొత్తం 2,114.83

2014కు ముందు 2,511
మొత్తం 4,626

సీఎం కేసీఆర్‌ కృషితోనే…

రాష్ర్టాభివృద్ధికి మంచి రోడ్లు ఉండాలని సీఎం కేసీఆర్‌ భావించారు. అనేక రోడ్లకు ట్రాఫిక్‌ ఫీజబులిటీ స్టడీ రిపోర్టులు చేయించారు. జాతీయ రహదారుల కోసం అనేక ప్రతిపాదనలు తయారు చేయించి కేంద్రాన్ని ఒప్పించారు. రాష్ట్రం వచ్చిన తర్వాతే 2,115 కిలోమీటర్ల నూతన జాతీయ రహదారులను సాధించుకున్నాం. దీంతో మొత్తం 4,626 కిలోమీటర్ల జాతీయ రహదారులు వచ్చాయి.

గణపతిరెడ్డి, రోడ్లు, భవనాలశాఖ ఈఎన్సీ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్వరాష్ట్రంలో రహదారుల నిగనిగ

ట్రెండింగ్‌

Advertisement