Cannes Horror | ఫ్రాన్స్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల వేళ ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్లామర్ ప్రపంచమంతా ఈ వేడుకల్లో మునిగితేలుతున్న సమయంలో, మిస్ వెనెజువెలా (2025) ఆండ్రియా డెల్ వాల్‌పై ఆమె వ్యక్తిగత స్టైలిస్ట్ లగునా కత్తెరతో దాడికి తెగబడ్డారు. ఈ నెల 19న కేన్స్‌లోని ఒక హోటల్ గదిలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడి జరిగిన వెంటనే ఆండ్రియా డెల్ వాల్ తన ముఖంపై అయిన రక్తపు గాయాలను చూపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆమె ముఖంపై రక్తపు మరకలు స్పష్టంగా కనిపిస్తుండగా, ఆ గది అంతా వస్తువులతో చిందరవందరగా పడి ఉంది. ఈ ఘోరానికి ఒడిగట్టిన స్టైలిస్ట్ లగునా కూడా అదే గదిలో ఉండడం ఆ వీడియోలో గమనార్హం.
హోటల్ గదిలో జరిగిన ఈ గొడవపై సమాచారం అందుకున్న యాజమాన్యం వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఫ్రాన్స్ పోలీసులు నిందితుడు లగునాను అక్కడికక్కడే అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. అయితే, వీరిద్దరి మధ్య ఇంతటి దారుణమైన వాగ్వాదం జరగడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేన్స్ నిర్వాహకులు కానీ, ఫ్రాన్స్ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, తీవ్ర గాయాలపాలైన ఆండ్రియా డెల్ వాల్‌కు స్థానిక ఆసుపత్రిలో వైద్యులు అత్యవసర చికిత్స అందించారని, ప్రస్తుతం ఆమె ప్రమాదం నుంచి బయటపడి కోలుకుంటున్నట్లు సమాచారం.