e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home Top Slides ముంబై మోడల్‌ సూపర్‌ సక్సెస్‌

ముంబై మోడల్‌ సూపర్‌ సక్సెస్‌

  • కరోనా వైరస్‌ కట్టడికి నగరంలో చతుర్ముఖ వ్యూహం
  • రోగులకు పరీక్ష ఫలితం చెప్పకుండానే వైద్య సేవలు
  • పేషెంట్‌ తరలింపునకు అంబులెన్స్‌, దవాఖానలో బెడ్‌
  • అలాట్మెంట్‌ ప్రక్రియ అంతా అధికారుల ఆధ్వర్యంలోనే
  • కొవిడ్‌ నుంచి కోలుకున్న వారికి విధిగా వ్యాక్సినేషన్‌
ముంబై మోడల్‌ సూపర్‌ సక్సెస్‌

కరోనాను ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి బీఎంసీ అధికారులు చతుర్ముఖ వ్యూహాన్ని అమల్లోపెట్టారు. అది ఎలాగంటే..
1.వార్‌రూమ్‌ ఆపరేషన్‌. 2.ట్రీట్మెంట్‌ అలాట్‌మెంట్‌. 3.ట్రీట్మెంట్‌ మానిటరింగ్‌. 4.పోస్ట్‌ డిశ్చార్జ్‌.

దేశంలో అత్యధిక జనాభా గల నగరాల్లో రెండో స్థానం. ఆర్థిక రాజధానిగా కీర్తి కిరీటం. అంతటి మహానగరం.. కరోనా కాటుకు విలవిల్లాడింది. అయినా భయంతో వెనుకంజ వేయలేదు. కనిపించని మహమ్మారిని ఎలాగైనా కట్టడి చేయాలని అక్కడి అధికారులు కృతనిశ్చయంతో కదిలారు. పటిష్టమైన వ్యూహాలతో ఎట్టకేలకు వైరస్‌కు ముకుతాడు వేశారు. కరోనా నియంత్రణలో ప్రస్తుతం ఆదర్శంగా నిలుస్తున్న ఆ నగరమే ముంబై. ఊహించని స్థాయిలో వ్యాపించిన కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు చతుర్ముఖ వ్యూహాన్ని అమలు చేశారు. వార్‌రూమ్‌ ఆపరేషన్‌, ట్రీట్‌మెంట్‌ అలాట్‌మెంట్‌, ట్రీట్‌మెంట్‌ మానిటరింగ్‌, పోస్ట్‌ డిశ్చార్జ్‌ కార్యాచరణతో కరోనాను నిలువరించగలిగారు. ‘ముంబై మోడల్‌’గా అది సర్వత్రా ప్రశంసలందుకుంటున్నది.

కరోనా సెకండ్‌వేవ్‌తో అతలాకుతలమైన మహారాష్ట్ర ఇప్పుడు ఆ మహమ్మారి వ్యాప్తిని గణనీయంగా నిలువరించింది. గతనెల మొదట్లో రాష్ట్రంలో రోజుకు సగటున 65 వేల కేసులు నమోదైతే, ప్రస్తుతం అది 20 వేలకు దిగివచ్చింది. ఈ విజయ సాధనకు ‘ముంబై మోడల్‌’ పునాదిగా నిలిచిందని చెప్పొచ్చు. కిక్కిరిసి ఉండే ధారావి మురికివాడతోపాటు నగరమంతా కరోనా కట్టడికి బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ఆ వివరాలు..

వార్‌రూమ్‌ ఆపరేషన్‌
వార్‌రూమ్‌ ఆపరేషన్‌లో మూడు కీలక కార్యాచరణలు ఉన్నాయి. మొదటిది.. కరోనా పరీక్ష ఫలితాలను నేరుగా రోగులకు కాకుండా సంబంధిత అధికారులకు పంపిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి అధికారులు రోగులకు తగిన మార్గనిర్దేశనం చేస్తారు. రెండోది.. ఏ దవాఖానల్లో పడకలు అందుబాటులో ఉన్నాయి? వ్యాధి తీవ్రతను తగ్గించే ఔషధాలు ఎక్కడ లభిస్తాయి? వంటి సమస్త సమాచారాన్ని బాధితులకు అందిస్తారు. మూడోది.. రోగులు కోరుకుంటే దగ్గరుండి దవాఖానలో చేర్పించి చికిత్స అందిస్తారు. ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి పూర్తిస్థాయిలో వికేంద్రీకరించారు. అంతకుముందు అమల్లోఉన్న ‘సెంట్రల్‌ వార్‌రూవ్‌ు (ముంబైలోని కరోనా రోగులందరి సమాచారం ఒకే దగ్గర)’ విధానాన్ని రద్దుచేసి 24 వార్డుల్లోనూ వార్‌రూవ్‌ులను (ముంబైని 24 భాగాలుగా విభజించి 24 మంది నోడల్‌ అధికారులు ఎల్లప్పుడూ పర్యవేక్షించడం) ఏర్పాటు చేశారు. రోజూ నగరంలోని దాదాపు 60 ల్యాబ్‌ల నుంచి 10-15 వేల పరీక్ష ఫలితాలను తెలుసుకుని వాటిని వార్డుల వారీగా వార్‌రూవ్‌ులకు పంపించారు.

ముంబై మోడల్‌ సూపర్‌ సక్సెస్‌

చికిత్స కేటాయింపు (ట్రీట్మెంట్‌ అలాట్మెంట్‌)
దవాఖానల్లో పడకలు, ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధించడంతో బీఎంసీ అధికారులు నగరంలోని 175 కొవిడ్‌ దవాఖానలను సమన్వయం చేసేందుకు ఆన్‌లైన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్న వివరాల్ని దీనిద్వారా పర్యవేక్షించారు. రోగులను దవాఖానలకు తరలించేందుకు వెయ్యి ఎస్‌యూవీలను అంబులెన్సులుగా మార్చారు. వీటిని ట్రాక్‌ చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశారు.

చికిత్సపై పర్యవేక్షణ (ట్రీట్మెంట్‌ మానిటరింగ్‌)
వ్యాధి తీవ్రతను బట్టి దవాఖానలో చేరిన రోగులకు చికిత్స అందించారు. ఆక్సిజన్‌ సరఫరాలో ఆటంకాలు ఏర్పడటం, ఐసీయూల్లో ఆక్సిజన్‌ లీకై అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో కేంద్రీయ ఆక్సిజన్‌ సరఫరా విధానాన్ని తీసుకొచ్చారు. 15 వేల లీటర్ల సామర్థ్యం ఉండే ఆక్సిజన్‌ ట్యాంకులను కొవిడ్‌ దవాఖానల ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేశారు. ప్రతి బెడ్‌కు పైపుల ద్వారా నిరంతరాయంగా ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. కనీస వ్యవధిని 14 రోజులుగా పెట్టుకొని రోగులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించారు.

కోలుకున్న తర్వాత.. (పోస్ట్‌ డిశ్చార్జ్‌)
కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన రోగుల వివరాలు సేకరించి నిర్ణీత సమయం కాగానే (కనీసం మూడు నెలలు) విధిగా వ్యాక్సిన్‌ వేశారు. మొదటి వేవ్‌లో కేసులు తగ్గినప్పటికీ, నగరంలోని అతిపెద్ద కొవిడ్‌ కేర్‌ తాత్కాలిక దవాఖానలను తీసివేయకుండా అలాగే ఉంచడంతో.. సెకండ్‌వేవ్‌కి అవే ప్రాణాధారాలయ్యాయి.

‘ధారావి’ కట్టడి ఇలా..
ముంబై మహానగరంలో ధారావి కిక్కిరిసిన మురికివాడ. అయితే వైరస్‌ కట్టడిలో భాగంగా బీఎంసీ అధికారులు ఇంటింటికి వెళ్లి అనుమానితులను గుర్తించారు. లాక్‌డౌన్‌ సమయంలో అక్కడి ప్రజలకు ఆహారాన్ని, కుటుంబాలకు రేషన్‌ సరకులను ఇంటికే తీసుకొచ్చి అందించారు. దీంతో వైరస్‌ గొలుసు విచ్ఛిన్నమైంది. కేసులు కూడా తగ్గాయి.

మూడోవేవ్‌కు‘టాస్క్‌ఫోర్స్‌’
మూడోవేవ్‌ పిల్లలపై పెను ప్రభావం చూపిస్తుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో బీఎంసీ ఓ కార్యదళాన్ని (టాస్క్‌ఫోర్స్‌) ఏర్పాటు చేసింది. పిల్లలకు పడకల ఏర్పాటు, వారి తల్లిదండ్రులకు వసతులను కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. పడకలు, ఆక్సిజన్‌ సరఫరా, ఐసీయూలతో కూడిన నాలుగు పిల్లల కొవిడ్‌ దవాఖానలను ఇప్పటికే సిద్ధం చేసింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముంబై మోడల్‌ సూపర్‌ సక్సెస్‌

ట్రెండింగ్‌

Advertisement