హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం తెలంగాణభవన్ కోలాహలంగా మారింది. వచ్చేనెల 15న వరంగల్‌లో నిర్వహించే తెలంగాణ విజయగర్జన సభ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ 20 నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు రెండో రోజూ ఎంతో ఉత్సాహంగా కొనసాగాయి. ఈ సమావేశాలకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, వారి కుటుంబసభ్యులు, అనుచరులు తెలంగాణభవన్‌లో సందడి చేశారు. పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన ‘వీ లవ్ టీఆర్ఎస్’, ‘టీఆర్ఎస్ <\@> 20’ బోర్డుల ముందు నిలబడి సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్‌రెడ్డి సహా అనేక మంది కార్పొరేటర్లు ఫొటోలు దిగారు. సన్నాహక సమావేశాలకు హాజరైన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పార్టీ భోజన ఏర్పాట్లు చేసింది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు.
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
టీఆర్ఎస్ అధ్యక్ష స్థానానికి నామినేషన్ల పర్వం మూడోరోజూ కొనసాగింది. మళ్లీ కేసీఆరే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని పలువురు నాయకులు కోరుతున్నారు. ఈ మేరకు కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ మైనారిటీ నాయకులు ఎంకే ముజీబుద్దీన్, మహమ్మద్ షబీబుద్దిన్ తదితరులు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, గొంగిడి మహేందర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, కరీంనగర్ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, అన్ని జిల్లాల డీసీసీబీ చైర్మన్లు, పలువురు ఇతర నేతలు కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్నికల పర్యవేక్షుడు పర్యాద కృష్ణమూర్తికి నామినేషన్ పత్రాలు అందజేశారు.