e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home Top Slides మాటతప్పిన ఏపీ సీఎం

మాటతప్పిన ఏపీ సీఎం

  • ‘రాయలసీమ’ఆపేస్తామని.. కొనసాగింపా!
  • అపెక్స్‌కౌన్సిల్‌లో ఇచ్చిన హామీ ఏమైంది?
  • ఏపీ జల దోపిడీని అడ్డుకొని తీరుతాం
  • పాలమూరును ఎండబెడితే ఊరుకోం
  • మీడియాతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
మాటతప్పిన ఏపీ సీఎం

హైదరాబాద్‌, జూన్‌ 21 (నమస్తే తెలంగాణ): కొత్త ట్రిబ్యునల్‌ విధివిధానాలు వెలువడ్డాకే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ను కొనసాగిస్తామని కేంద్రం నియమించిన అపెక్స్‌ కమిటీకి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాటిచ్చి తప్పారని అబ్కారీ, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ ప్రాజెక్టును నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అపెక్స్‌కౌన్సిల్‌ సూచన మేరకు సుప్రీంకోర్టులో కృష్ణాజలాల్లో వాటాపై వేసిన కేసును రాష్ట్రం ఉపసంహరించుకున్నదని వివరించారు. సీఎం కేసీఆర్‌ మాటపై నిలబడితే, ఏపీ సీఎం జగన్‌ మాట తప్పారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో సోమవారం మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాజెక్టుతో పాలమూరుకు తీరని నష్టం వాటిల్లుతుందని, అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

పర్యావరణ అనుమతులు లేకుండా, గ్రీన్‌ట్రిబ్యునల్‌ వద్దని వారించినా ఇష్టమొచ్చినట్టు ఏపీ వ్యవహరిస్తే ఏంచేయాలో తమకు తెలుసని స్పష్టంచేశారు. ఇరుగుపొరుగు రాష్ర్టాలతో సత్సంబంధాలు, సుహృద్భావ వాతావరణాన్ని సీఎం కేసీఆర్‌ కోరుకుంటే, అందుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ వ్యవహరిస్తున్నదని.. నిబంధనలకు, జల న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ కొనసాగిస్తున్న జలదోపిడీని అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఎవరైనా చెడు చేయాలని భావిస్తే వారిపట్ల అంతే చెడుగా సీఎం కేసీఆర్‌ ఉంటారని హెచ్చరించారు.

- Advertisement -

పాలమూరు జిల్లా ఎడారి కావాలా?
కృష్ణాజలాల వినియోగం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ మొండిగా వ్యవహరిస్తున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ను నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని ఆరోపించారు. ఏపీ జలదోపిడితో వెనుకబడిన పాలమూరు జిల్లా ఎడారి కావాలా? అని ప్రశ్నించారు. ‘మేము పైన ఉన్నాం. ప్రాజెక్టులు ఎన్నయినా కట్టుకోవచ్చు. కానీ సీఎం కేసీఆర్‌ మనం బాగుండాలి. పక్కవాళ్లు బాగుపడాలి’అనే మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నారని చెప్పారు. స్నేహహస్తం అంటూనే ఆంధ్రప్రదేశ్‌ వెకిలిచేష్టలు చేస్తున్నదని మండిపడ్డారు. నీళ్ల తరలింపు విషయంలో లెక్కపక్కాగా ఉండాలని ఏర్పాటుచేసిన టెలిమెట్రీకి ఏపీ కొర్రీలు పెడుతున్నదని ఆరోపించారు.

పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ఏపీ అంతకంతకు పెంచుతూ పాలమూరు జిల్లాకు అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. నోట్లో చక్కరపోస్తూ కడుపులో కత్తిపెట్టిన చందంగా ఏపీ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పటి నుంచే తాము పోరాటాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వంలా తాము వ్యవహరిస్తే ఒక నీటి చుక్కకూడా కిందికి వెళ్లదని హెచ్చరించారు. జగన్‌ను సీఎం కేసీఆర్‌ తమ్ముడిలా భావించి స్నేహహస్తం అందిస్తుంటే, ఆయన ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని.. ఇప్పటికైనా సయోధ్యతో మెలగాలని సూచించారు.

అన్నదమ్ముల్లా ఉన్న ప్రజల మధ్య చిచ్చువద్దు
ఇరుగుపొరుగు రాష్ర్టాలు సఖ్యతగా ఉండాలని మహారాష్ట్రతో స్నేహపూర్వక చర్చలు జరిపి ఒప్పించి మెప్పించి సీఎం కేసీఆర్‌ గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా రెడ్‌కార్పెట్‌ వేసి ఆంధ్ర, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానించి సరికొత్త సయోధ్యకు అంకురార్పణ చేశారని పేర్కొన్నారు. రాష్ర్టాలుగా విడిపోదాం.. ప్రజలుగా కలిసి ఉందామని ఉద్యమసమయంలో చెప్పిన మాటకు కట్టుబడి, ఏపీ ప్రజలతో సఖ్యతో ఉంటున్నామని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ఉండే సీమాంధ్ర ప్రజలే ఏపీ వ్యవహారాన్ని చూసి నిర్ఘాంతపోతున్నారని అన్నారు. అన్నదమ్ముల్లా ఉన్న ప్రజల మధ్య చిచ్చుపెట్టవద్దని హితవు పలికారు.

విడిపోయినా ఆగని జలదోపిడీ
ఉమ్మడి రాష్ట్రంలో చైన్నైకు మానవతాదృక్పథంతో నీళ్లిస్తే, తెలుగుగంగ పేరిట జలదోపిడీకి పాల్పడ్డారని శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు నుంచి 10వేల క్యూసెక్కులు తీసుకెళ్తామని 40వేల క్యూసెక్కులు తరలించారని, ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 80 వేల క్యూసెక్కులు తీసుకెళ్లేందుకు కుట్రచేస్తున్నారని ధ్వజమెత్తారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మాటతప్పిన ఏపీ సీఎం
మాటతప్పిన ఏపీ సీఎం
మాటతప్పిన ఏపీ సీఎం

ట్రెండింగ్‌

Advertisement