e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home Top Slides మాటు వేసి వేటు!

మాటు వేసి వేటు!

మాటు వేసి వేటు!

జవాన్లపై మావోయిస్టుల దాడిలో
24కు పెరిగిన మృతుల సంఖ్య
పక్కా పథకం ప్రకారమే దాడి!
సూత్రధారి మోస్ట్‌ వాంటెడ్‌ హిడ్మా

కొత్తగూడెం క్రైం, ఏప్రిల్‌ 4: ఛత్తీస్‌గఢ్‌లో దండకారణ్యం శనివారం బాంబులతో దద్దరిల్లింది. అడవిలో తుపాకుల మోత మోగింది. నేల జవాన్ల నెత్తురుతో తడిసింది. మావోయిస్టులు మాయోపాయంతో భద్రతా దళాలను అడవిలోకి రప్పించి మాటు వేసి కాల్పులకు తెగబడ్డారు. ఇరువర్గాల మధ్య కొన్ని గంటలపాటు సాగిన భీకర పోరు యుద్ధాన్ని తలపించింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించినట్టు వార్తలు వచ్చాయి. అనంతరం అడవిలో గాలిస్తున్న క్రమంలో జవాన్ల మృతదేహాలు లభించాయి. మావోయిస్టుల మెరుపుదాడిలో మరణించిన మొత్తం జవాన్ల సంఖ్య 24కు పెరిగింది. 31 మంది గాయపడ్డారు. మృతుల్లో ఏపీకి చెందిన మురళీ కృష్ణ, జగదీశ్‌ ఉన్నారు. వీరు కోబ్రా 210 దళంలో పనిచేస్తున్నారు. బీజాపూర్‌, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు హిడ్మా ఉన్నాడన్న సమాచారంతో డీఆర్‌జీ, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, సీఆర్‌పీఎఫ్‌, కోబ్రా బలగాలు శుక్రవారం రాత్రి నుంచి కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. భద్రతా బలగాల కోసం హిడ్మా నేతృత్వంలోని పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) సిల్గేరీ అటవీ ప్రాంతంలో గుట్టలపై మాటు వేసింది. శనివారం మధ్యాహ్నం బలగాలు అక్కడికి రాగానే మెరుపు దాడి చేసింది. అనంతరం మావోయిస్టులు పోలీసుల దగ్గర నుంచి 20కి పైగా ఆయుధాలను ఎత్తుకెళ్లారు. మావోయిస్టులే తప్పుడు సమాచారం ఇచ్చి భద్రతా దళాలు అడవిలోకి వచ్చేలా పథకం పన్ని ఉంటారని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలను సీఆర్‌పీఎఫ్‌ డీజీపీ కుల్‌దీప్‌ సింగ్‌ కొట్టిపారేశారు. ఘటనలో ఇంటలిజెన్స్‌ వైఫల్యం లేదన్నారు. నక్సలైట్లలో కూడా 10-12 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

మెషీన్‌ గన్‌లతో దాడి

జవాన్లపై దాడిలో మావోయిస్టులు మెషీన్‌ గన్‌లను, బాంబులను ప్రయోగించారు. దీంతో జవాన్లు అప్రమత్తమయ్యేలోపే భారీ ప్రాణనష్టం జరిగింది. మావోయిస్టుల్లో ఓ మహిళ తప్ప మిగతా మరణాలకు సంబంధించిన సమాచారం అధికారికంగా తెలియరాలేదు. కాల్పుల ఘటనతో ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో హైఅలెర్ట్‌ ప్రకటించాయి. తెలంగాణలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

సరైన సమాధానం ఇస్తాం: అమిత్‌ షా

మావోయిస్టుల దాడిలో చనిపోయిన జవాన్ల పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తదితరులు సంతాపం ప్రకటించారు. జవాన్ల త్యాగాలను దేశం మరువబోదన్నారు. నక్సల్స్‌కు సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తామని అమిత్‌ షా అన్నారు. ఆయన ఆదివారం ఢిల్లీలో ఉన్నత స్థాయి భద్రతా సమావేశాన్ని నిర్వహించారు. దండకారణ్యంలో పరిస్థితులపై సమీక్షించారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ ఆకాంక్షించారు.

ఎవరీ హిడ్మా

హిడ్మా సుక్మా జిల్లాలో ఓ గిరిజన తెగకు చెందినవాడు. 1990ల్లో మావోయిస్టులతో చేరాడు. పీఎల్‌జీఏ బెటాలియన్‌ నంబర్‌ 1కు నేతృత్వం వహిస్తున్నాడు. ఈ బెటాలియన్‌లో 180-250 మంది మావోయిస్టులు ఉన్నారు. హిడ్మా దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఎన్నో దాడుల్లో పాల్గొన్నాడు. అతని తలపై రూ.40 లక్షల రివార్డు ఉన్నది. భీమ్‌ మాండవి హత్య కేసులో హిడ్మాపై ఎన్‌ఐఏ చార్జ్‌ షీట్‌ దాఖలు చేసింది.

ఇవి కూడా చదవండి..

రేపే కీలక పోరు

మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ

ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు.. నలుగురి మృతి

Advertisement
మాటు వేసి వేటు!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement