– కర్ల రాజేశ్ తల్లికి రూ.5 లక్షల చెక్కు అందించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, జూన్ 02 : పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురై దుర్మరణం పాలైన కర్ల రాజేశ్ కుటుంబాన్ని ఓదార్చి ఔదార్యంతో ఆర్థిక సహాయాన్ని అందిస్తానన్న బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. మంగళవారం కోదాడలో రాజేశ్ తల్లి సుశీలమ్మకు కేటీఆర్ పంపిన రూ.5 లక్షల విలువ గల చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమాయకుడైన కర్ల రాజేశ్ ముమ్మాటికి పోలీసుల కస్టడీలోని చిత్రహింసలపాలై మృతి చెందాడన్నారు. అయితే ఇప్పటివరకు బాధ్యులైన పోలీసులను అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. రాజేష్ హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడమే కాక వారికి వత్తాసు పలుకుతూ కాపాడుతుందన్నారు.
ఇప్పటివరకు ఎస్సీ యాక్ట్ ప్రకారం రాజేశ్ కుటుంబానికి ప్రయోజనం చేకూరిందే కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క నయాపైసా కూడా ఆర్థిక సాయం అందలేదన్నారు. రాజేశ్ హత్యకు కారణమైన పోలీసులను అరెస్టు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గం ప్రజలు తమ కుటుంబ సభ్యులు అని చెప్పే మంత్రి ఉత్తమ్ ఇప్పటివరకు రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించకపోవడం శోచనీయమన్నారు. ఇక్కడి ప్రజలపై వారికున్న ప్రేమ ఏ పాటిదో దీంతో స్పష్టమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎస్కే నయీమ్, పైడిమరి సత్యబాబు, కౌన్సిలర్ చీమ నరేశ్, చీమ శ్రీనివాస్, కర్ల సుందర్ బాబు, ఉపేందర్, కరీముల్లా, బాబా తాజ్, ఎమ్మార్పీఎస్ నాయకుడు రాజు పాల్గొన్నారు.