
నమస్తే తెలంగాణ నెట్వర్క్: కార్మిక క్షేత్రం సిరిసిల్ల జలసంద్రమైంది. గతంలో ఎన్నడూలేని విధంగా మంగళవారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి జిల్లా తడిసి ముద్దయ్యింది. జిల్లావ్యాప్తంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 30 ఏండ్ల తర్వాత అంతటి భారీ వాన కురిసినట్టు అధికారులు తెలిపారు. కోనరావుపేట మండలంలోని ధర్మారం చెరువు మత్తడి దూకి నీరు సిరిసిల్ల మండలంలోని బోనాల గ్రామంలోని పెద్ద చెరువు, జంగమయ్యకుంట, శుద్ధగండి చెరువులోకి చేరింది. మూడు చెరువులు మత్తళ్లు దుంకడంతో నీరు సిరిసిల్లను ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలైన వెంకంపేట, ప్రగతినగర్, శివనగర్, అశోక్‌నగర్, పాతబస్టాండ్, సంజీవయ్యగర్, నేతన్నచౌక్, మెయిన్ బజార్, శాంతినగర్ వార్డులు నీటమునిగాయి. నడుము లోతు నీరు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దుకాణాలు, షాపింగ్‌మాల్స్, మెడికల్ హాళ్లలోకి నీరు చేరి బట్టలు, నిత్యావసరాలు తడిసి తీరని నష్టం వాటిల్లింది. సిరిసిల్లలోని బస్టాండ్, కలెక్టరేట్ వరద నీటితో చెరువులుగా మారాయి. కలెక్టరేట్ గేట్లు కూడా తెరవని పరిస్థితి నెలకొనడంతో అధికారులంతా బయటే ఉండి, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. పాతబస్టాండ్ చెరువుగా మారడంతో బస్సులన్నీ తంగళ్లపల్లి బ్రిడ్జి వద్ద చౌరస్తాలో నిలిపివేశారు. వేములవాడ మూల వాగు ఉగ్రరూపం దాల్చడంతో నూతనంగా నిర్మిస్తున్న వంతెన శ్లాబ్ సెంట్రింగ్ కూలిపోయింది.
పైకి వస్తున్న పాతాళగంగ
బోథ్, సెప్టెంబర్ 7: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భూగర్భ జలాలు భూ సమాంతరానికి చేరాయి. బావుల్లో నీరు నిండి బయటకు పారుతుండగా.. బోరుబావులు వాటికి అవే నీటిని ఎత్తి పోస్తున్నాయి. ధన్నూర్ (కే) గ్రామానికి చెందిన ఆసాల పెద్దన్న అనే రైతు పొలంలో మంగళవారం నీటిని ఎత్తిపోస్తున్న బోరుబావిని ‘నమస్తే తెలంగాణ’ క్లిక్ మనిపించింది.
అధికారులతో సమీక్షించిన మంత్రి కేటీఆర్
వరదలో చిక్కుకున్న ప్రజలకు సహాయ చర్యలు చేపట్టాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫోన్లో జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ నుంచి వచ్చిన 25 డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వరదలో చిక్కుకున్న వారిని ఎస్పీ రాహుల్‌హెగ్డె సిబ్బందితో రక్షించారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని కలెక్టర్ అనురాగ్ శర్మ తన కారులో దవాఖానకు తరలించారు. వరదలో చిక్కుకున్న ప్రజలకు సహాయం అందించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కిగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునివ్వడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ముందుకొచ్చి సహాయక చర్యలు చేపట్టారు.
వరదల్లో చిక్కుకొని ముగ్గురు మృతి
వరదల్లో చిక్కుకుని రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు మృతిచెందగా, పలువురు గల్లంతయ్యారు. బైక్‌పై చెరువు మత్తడి దాటుతూ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని నందిపల్లికి చెందిన తండ్రీకొడుకు కుడకల గంగమల్లు (45), విష్ణువర్ధన్ (7) మృతిచెందారు. కామారెడ్డి జిల్లా అదే మండలంలోని గర్గుల్‌లో గోడ కూలి నిమ్మ నర్సవ్వ (35) మృతిచెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్ దగ్గరలోని మ్యాన్‌హోల్‌లో పడి పెరుమాండ్ల దేవయ్య (55) గల్లంతయ్యాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి వద్ద వాగు దాటుతుండగా కృష్ణస్వామి అనే వ్యక్తి నీటిలో కొట్టుకుపోయాడు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేట- హరిశ్చంద్రతండా మధ్య వాగు దాటుతుండగా రైతు బీమ్లా నీటిలో పడిపోయాడు. స్థానికులు అతన్ని రక్షించి ఒడ్డుకు చేర్చారు. వరంగల్ నగరంలోని ఎన్టీఆర్నగర్, పద్మావతినగర్‌లోని జలదిగ్బంధంలో చిక్కుకున్న 150 మందిని డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లు, లైవ్ జాకెట్లతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ 3వ వార్డులోని లక్ష్మీపురం చెరువు మత్తడి దుంకడంతో 3 నివాసాల్లో 12 మంది వరదలో చిక్కుకున్నారు. వీరిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తాడు సాయం వరదనీటిని దాటించి ఒడ్డుకు చేర్చారు.

5 వేల కోళ్లు మృత్యువాత
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని చింతలూర్‌లో ఓ పౌల్ట్రీఫాం నీట మునగగా.. 5 వేల కోళ్లు మృత్యువాతపడ్డాయి. కొన ఊపిరితో ఉన్న కోళ్లను చట్టుపక్కల వారు తీసుకెళ్లారు.
నేలకూలిన ఇండ్లు
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మైలారంలో రాహుల్బీకి చెందిన ఇంటి గోడ కూలింది. డిచ్పల్లి మండలం బర్దిపూర్‌లో ఓ పెంకుటిల్లు ధ్వంసమైంది. మోర్తాడ్ మండలవ్యాప్తంగా ఆరు ఇండ్లు కూలాయి. ఎడపల్లి మండలం ఒడ్డాపల్లిలో దేవాలయం ప్రహరీ కూలింది. కమ్మర్పల్లి మండలం కోనాపూర్‌లో ఇంటి పైకప్పు కుప్పకూలింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం వీరాపూర్‌లో ఇల్లు కూలడంతో ఓ కుటుంబం రోడ్డున పడ్డది. హైదరాబాద్, హనుకొండ ప్రధాన రహదారి సహా పలు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. మహబూబాబాద్ జిల్లాలో కొత్తగూడ మండలంలోని పది ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో కరీంనగర్ సర్కిల్ పరిధిలోని పలుప్రాంతాల్లో 38 విద్యుత్తు స్తంభాలు పడిపోయాయి. నాలుగు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి.
భారీగా పంట నష్టం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామం వద్ద చెక్‌డ్యాం తెగి 80 ఎకరాల పంట నీటమునిగింది. వరంగల్ జిల్లాలో 4,397 హెక్టార్లలోని వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. హనుమకొండ జిల్లావ్యాప్తంగా ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో 6400 ఎకరాల్లోని వివిధ పంటలు నీట మునిగాయి.
బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
మంచిర్యాల జిల్లాలో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. జయశంకర్ భూపాలపల్లిలోని కేటీకే ఉపరితల బొగ్గుగని 2,3లో ఉత్పత్తి నిలిచిపోయింది. పెద్దపల్లి జిల్లా సింగరేణి రామగుండం రీజియన్‌లోని ఓసీపీ 1, ఓసీపీ 2, ఓసీపీ 3, మేడిపల్లి ఓసీపీలో ఉత్పత్తికి ఆటంకం కలిగింది. దీంతో 44 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కాగా, మంగళవారం మధ్యాహ్నం తర్వాత నుంచి ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది.
నిండుకుండల్లా లక్నవరం, రామప్ప
ములుగు జిల్లాలో రామప్ప, లక్నవరం సరస్సులు ఉగ్రరూపం దాల్చాయి. ఏటూరునాగారంలోని రామన్నగూడెం, మంగపేట పుష్కరఘాట్లకు ఆనుకొని గోదావరి నది ప్రవహిస్తుంది. తాడ్వాయి మండలం మేడారం పరిసర ప్రాంతాల్లో జంపన్నవాగు వంతెనలకు ఆనుకొని నీరు ప్రవహిస్తున్నది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం జలదిగ్బంధం అయ్యింది. దీంతో ఆలయం మూసివేసి రాజగోపురం వద్ద పూజలను నిర్వహించారు.