థేమ్స్ నది ఒడ్డున లండన్.. సెయిన్ ఒడ్డున ప్యారిస్.. మూసీ చెంత భాగ్యనగరం.. నీరున్న చోటే నాగరికత వెలుస్తుందనేందుకు తార్కాణాలివి. మరి నాగరికతే ఆ జీవ నదులకు ఉరికొయ్యగా మారితే? చాలాదేశాల్లో ఇప్పుడదే పరిస్థితి. నాగరికతకు ఆయువు పట్టయిన నదుల రక్షణకు పాలకులు, ప్రజలు పూనుకొంటున్నారు. కొన్ని చోట్ల నదులకు పూర్వవైభవం తెచ్చి, పర్యాటక కేంద్రాలుగా మార్చారు.
మరి.. మన మూసీ? అరవయ్యేండ్ల సమైక్య పాలనలో మురికి కాలువలా మారింది. ఒకనాడు ముచికుందగా పాల నురగల్లాంటి స్వచ్ఛమైన నీరు పారిన చోట ఇప్పుడు గరళం పారుతూ దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తున్నది. పరీవాహక ప్రాంతం గొంతు నులిమి, నగరం నడిబొడ్డున ఉన్న మూసీని మురుగుకు ప్రవాహంలా మార్చారు. మురికి కాల్వగా తయారుచేశారు.
సమీప భవిష్యత్తులోనే ప్రజలు కుటుంబాలతో కలిసి మూసీ తీరాన సేదదీరవచ్చు! మూసీలో పారే స్వచ్ఛమైన నీటిలో సరదగా పడవ ప్రయాణాలూ చేయొచ్చు! అవును.. ఇకపై మూసీ మురికి కూపం కాదు.. ఏ సమయంలోనూ నదిలో మురికి లేకుండా ఎప్పటికప్పుడు ప్రవహించే గోదావరి జలాలతో సుజల స్రవంతిగా మారనున్నది! అందుకే మూసీ-గోదావరి అనుసంధానం!
గుండాల కృష్ణ – హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : మూసీ ఇక కాలగర్భంలో కలిసిపోవటమే అనుకొంటున్న తరుణంలో తెలంగాణ సర్కారు దానికి తిరిగి ఊపిరిలూదే బృహత్ కార్యాన్ని నెత్తికెత్తుకొన్నది. మూసీ అంటే మురుగు కాదు, హైదరాబాద్‌కు గౌరవ ప్రతీక అనేలా మార్చే చర్యలు చేపట్టింది. సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి పూర్వ వైభవం తెచ్చేందుకు ముమ్మరంగా పనులు చేపడుతున్నది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి 700 క్యూసెక్కుల జలాలను జంట జలాశయాలకు కేటాయించారు. తద్వారా మూసీకి మురుగు నుంచి విముక్తి కల్పించి విశ్వనగర ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసేందుకు కార్యాచరణ రూపొందించారు. సుందర మూసీ కోసం రూపొందించిన ప్రణాళికను పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఇటీవల అసెంబ్లీ ముందు ఉంచారు.
మరో చారిత్రక ఘట్టంగా..
కొండపోచమ్మ సాగర్ నుంచి జంట జలాశయాలకు గోదావరి జలాలను తరలించే ప్రక్రియ పూర్తయితే మరో చారిత్రక ఘట్టం కూడా ఆవిష్కృతం అవుతుంది. మూసీ కృష్ణాకు ఉపనది. జంట జలాశయాలకు గోదావరిజలాలను తరలించడం ద్వారా మూసీ నుంచి ఆ జలాలు తిరిగి కృష్ణాలోకి చేరుతాయి. అంటే వయా మూసీ గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం జరగనుండటం మరో విశేషం.
నిత్యం సాఫీగా ఉండేలా
కొండపోచమ్మ సాగర్ నుంచి జంట జలాశయాలకు గోదావరి జలాలను తరలించిన తర్వాత అవసరానికి అనుగుణంగా మూసీలోకి నీటిని వదిలేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయనున్నదని ఒక అధికారి తెలిపారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి గేట్లు ఎత్తటం ద్వారా వదిలే జలాలు వేర్వేరు మార్గాల ద్వారా లంగర్‌హౌస్ వద్ద మూసీలోకి వస్తాయి. దీంతో మూసీలో ఉన్న వ్యర్థాలు కొట్టుకుపోయి నదీమార్గం శుభ్రంగా తయారు కానున్నది. నగరంలో రోజుకు ఉత్పత్తి అయ్యే 1,600 మిలియన్ లీటర్ల మురుగు నీటిని వందశాతం శుద్ధి చేసేలా ప్రభుత్వం చేపడుతున్న 31 శుద్ధి కేంద్రాల నిర్మాణాలను రెండేండ్లలో పూర్తి చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. వీటివల్ల భవిష్యత్తులో మూసీలోకి మురుగు కూడా వచ్చే పరిస్థితి ఉండదు.
కొండపోచమ్మ టు గండిపేట ఇలా..
ప్రయోజనాలు..
30 ఏండ్లలో మురికి కాలువలా..
ఇదీ మూసీ చరిత్ర..