‘తెలంగాణ రాకముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. దీంతో ఘర్షణలు, వివాదాలు తలెత్తేవి. ఈ అనర్థాలను రూపుమాపేందుకు, ప్రతి గుంటకు యజమాని ఎవరో తెలిసేందుకు భూరికార్డుల ప్రక్షాళన, కొత్త రెవెన్యూచట్టం, ధరణి పోర్టల్.. ఇలా ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ధరణి ద్వారా అవినీతిరహితంగా లావాదేవీలు సాగిపోతున్నాయి. గుంట పొలం ఉన్న రైతు సైతం గుండెనిబ్బరంతో ఉంటున్నారు. ప్రభుత్వం అందించే ప్రతి పథకం అర్హులందరికీ సక్రమంగా చేరుతున్నది’
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): భూ బాంధవి ధరణి పోర్టల్ విజయవంతంగా కొనసాగుతున్నది. గతంలో కాగితాలు పట్టుకొని కార్యాలయాలు, అధికారుల చుట్టూ ఏండ్లపాటు ప్రదక్షిణలు చేసినా, కాసులు ముట్టజెప్పినా తీరని భూ సమస్యలకు ధరణి సులభంగా పరిష్కారం చూపుతున్నది. ఒక్కపైసా అవినీతికి తావులేకుండా.. ఆలస్యానికి ఆస్కారం లేకుండా వ్యవసాయ భూముల లావాదేవీలు నిరాటంకంగా సాగిపోతున్నాయి. ఇంట్లోనే కూర్చొని లేదా సమీపంలోని మీసేవా కేంద్రానికివెళ్లి ఆన్లైన్ అప్లికేషన్ పెడితే చాలు అత్యంత సులభంగా సమస్య పరిష్కారమవుతున్నది. ధరణితో ఆఫీస్ కేంద్రంగా ఉన్న సేవలన్నీ నేడు రైతుకేంద్రంగా మారిపోయాయి. గతేడాది అక్టోబర్ 29న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభమైన ధరణి పోర్టల్ ఏడు నెలల్లోనే ఐదులక్షల లావాదేవీలను పూర్తి చేసుకున్నది. 3.15 కోట్ల మంది పోర్టల్‌ను వీక్షించారు. సగటున నెలకు 70 వేల చొప్పున సోమవారం (మే 31) నాటికి 5,01,249 లావాదేవీలు పూర్తయ్యాయి. 5.79 లక్షల మంది పోర్టల్ వేదికగా చెల్లింపులు చేశారు. తద్వారా ప్రభుత్వానికి రూ.557 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ లావాదేవీల్లో సగానికిపైగా భూముల క్రయవిక్రయాలే.
35 రకాల సేవలు
ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పుడు నాలుగు ఆప్షన్లు మాత్రమే ఉండేవి. తర్వాత ప్రభుత్వం ఒక్కో మాడ్యూల్‌ను జతచేసింది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అధికారులు గుర్తించిన సమస్యలను బట్టి సేవలను పెంచుతూ పోయింది. ప్రస్తుతం పోర్టల్‌లో 35 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకర్లు, ఎన్నారైల కోసం ప్రత్యేకంగా మాడ్యూల్స్ అందుబాటులోకి తెచ్చింది. పోర్టల్‌లోని జీపీఏ, డీజీపీఏ, ఏజీపీఏ, మార్టిగేజ్, పవర్ ఆఫ్ అటార్నీ, లీజ్ వంటి మాడ్యూల్స్‌కు మంచి స్పందన వస్తున్నది.
పెండింగ్ సమస్యలకు మోక్షం
ధరణి పోర్టల్.. ఏండ్లుగా చిక్కుముడిగా ఉన్న అనేక సమస్యలను తీర్చే కల్పతరువుగానూ మారింది. భూ సంబంధ సమస్యలపై అభ్యర్థనల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ‘గ్రీవెన్స్ మాడ్యూల్’కు సుమారు 60 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సగానికిపైగా పరిష్కారమయ్యాయి. పెండింగ్ మ్యుటేషన్లు, ఆధార్ సమస్యలు, సంస్థల పేరుమీద పాస్‌బుక్‌లు తదితర సమస్యలకు పోర్టల్ పరిష్కారం చూపింది.
ఎన్నారైల్లో హర్షాతిరేకాలు
ఒకప్పుడు గ్రామాల్లో ఉన్న రైతులకే తమ పొలం ఎప్పుడు ఎవరి పేరుమీదకు మారుతుందో తెలిసేకాదు. ఇక విదేశాల్లో ఉన్నవారి భూముల భద్రత గాల్లో దీపంలా ఉండేది. ఎన్నారైలు సెలవుపై సొంతూళ్లకు వచ్చినప్పుడు తమ భూములు అన్యాక్రాంతమయ్యాయని గుర్తించి, అధికారుల చుట్టూ తిరగడానికే సరిపోయేది. మరికొందరు మానసిక ఒత్తిడి తట్టుకోలేక అగ్గువకే అమ్ముకొని వెళ్లిపోయేవారు. అలాంటివారికి ధరణి పోర్టల్ కొండంత అండగా నిలిచింది. ప్రపంచంలో ఎక్కడున్నా తమ భూములు భద్రంగా ఉన్నాయో లేదో చూసుకునే అవకాశం కల్పించింది. ఆధార్ కార్డుతో పనిలేకుండా పాస్‌పోర్ట్ నంబర్ లేదా వారు నివసిస్తున్న దేశ పౌరసత్వ గుర్తింపు సంఖ్య ఆధారంగా పాస్‌బుక్‌లు మంజూరుచేసింది. వీటి ఆధారంగా వారు భూములను అమ్మడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి అవకాశం కల్పించింది. ఎవరైనా తమ భూములను అమ్మాలనుకుంటే నమ్మకమైన వ్యక్తులకు ఆన్లైన్లోనే జీపీఏ చేసే అవకాశం కూడా కల్పించింది. పాస్‌బుక్ లేకుండానే నాలా కన్వర్షన్ చేసుకునే ఆప్షన్‌ను సైతం పొందుపరిచింది. దీంతో ఎన్నారైలు ప్రశాంతంగా ఉంటున్నారు.
అహోరాత్రులు శ్రమకు ఫలితం
ధరణి పోర్టల్ నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల కలిగే ప్రతి అనర్థానికి ధరణి పరిష్కారం చూపాలని, భవిష్యత్తులో అలాంటి సమస్యలు రాకుండా కట్టుదిట్టంగా ఉండాలని సంకల్పించారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపు మూడేండ్లపాటు శ్రమించారు. అనేకసార్లు సమీక్షలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు పోర్టల్ నిర్మాణంలో తలమునకలైన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ పోర్టల్ ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పినవే. పోర్టల్‌ను ప్రారంభించాక కూడా సీఎం కేసీఆర్ అనేకసార్లు సమీక్షలు నిర్వహించారు. పోర్టల్ పనితీరును నిరంతరం పర్యవేక్షించారు. వస్తున్న విజ్ఞప్తులకు అనుగుణంగా మాడ్యూల్స్ తెచ్చేలా కృషిచేశారు. ఇప్పటికీ పోర్టల్ పనితీరుపై ఆయన ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు.
‘భూ సేకరణ’నమోదు తప్పులపై గ్రీవెన్స్
ప్రభుత్వం కాలువలు, రోడ్లు వంటి ప్రజావసరాల కోసం రైతుల నుంచి సేకరించే భూముల లెక్కల్లో పొరపాట్లను సరిచేసుకొనేందుకు ధరణి పోర్టల్‌లో కొత్త ఆప్షన్‌ను తీసుకువచ్చారు. ప్రజావసరాల కోసం సేకరణ సమయంలో కొన్నిసార్లు రైతుకు చెందిన మొత్తం భూమి నిషేధిత జాబితాలోకి వెళ్తున్నది. దీంతో మిగతా భూమికి పట్టాదార్ పాస్ పుస్తకం రావడం లేదు. ఆ రైతుకు ప్రభుత్వ ప్రయోజనాలు దూరం కావడంతోపాటు క్రయవిక్రయాలు నిలిచిపోతున్నాయి. ప్రజల నుంచి ఈ తరహా విజ్ఞప్తులు ఎక్కువగా వస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం తాజాగా ధరణి పోర్టల్ వేదికగా విన్నవించే అవకాశం కల్పించింది. ‘గ్రీవెన్స్ రిలేటెడ్ టు ల్యాండ్ అక్వైర్డ్’ పేరుతో కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది. బాధితులు సొంతంగా సిటిజన్ లాగిన్ నుంచి లేదా సమీపంలోని మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భూమి అసలు విస్తీర్ణానికి సంబంధించిన పత్రాలను, ప్రభుత్వం భూ సేకరణ చేసినప్పుడు ఇచ్చే పత్రాన్ని అప్లోడ్ చేయాలి. ఈ దరఖాస్తు నేరుగా కలెక్టర్ లాగిన్‌కు వెళ్తుంది. పరిశీలన అనంతరం.. సక్రమమైనదే అనిపిస్తే మార్పులు చేస్తారు.
109 రిజిస్ట్రేషన్లు
లాక్డౌన్ అనంతరం సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా.. ధరణి పోర్టల్ ద్వారా 109 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో క్రయవిక్రయాలు-83, ఫౌతి 25, భాగ పంపకం-1 జరిగినట్టు అధికారులు తెలిపారు. 14 నాలా దరఖాస్తులను, 56 పెండింగ్ మ్యుటేషన్లను పరిష్కరించినట్టు పేర్కొన్నారు. 387 స్లాట్లు, పెండింగ్ మ్యుటేషన్ కోసం 56 దరఖాస్తులు వచ్చాయి.
సేవల్లో ప్రధానమైనవి
మార్టిగేజ్ : 25,463
జీపీఏ, ఏజీపీఏ, డీజీపీఏ : 497
లీజ్ : 53