పర్యావరణానికి అడవే ఆయువుపట్టు. చెట్టే మనిషి మనుగడకు జీవనాడి. చెట్లను నరుకుడే తప్ప నాటడం మర్చిపోవటంతో భూగోళం మండిపోతున్నది. ఏటేటా ఉష్ణోగ్రతలు పెరిగి వేసవిలో 50 డిగ్రీల సెల్సియస్ సర్వసాధారణమైంది. ఈ సమస్యకు హరితహారం పరిష్కారం చూపింది. సూర్యతాపానికి సూర్యాపేట జిల్లా అడ్డుకట్టవేసింది. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేయటంతో కొన్నేండ్లుగా వేసవిలో భగభగ మండిన జిల్లా ఇప్పుడు చల్లని లోగిలి అయ్యింది. ఏడు విడతల హరితహారంలో ఆరుకోట్ల మొక్కలను నాటి సంరక్షించటంతో జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు దాదాపు 6 డిగ్రీల వరకు తగ్గాయని వాతావరణశాఖ వెల్లడించింది. జిల్లాలో ఇప్పుడు ఏ పల్లెను చూసినా అడవిని తలపిస్తున్నది.
సూర్యాపేట, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమ ఫలితాలు కనిపించటం మొదలైంది. అడవులు అంతరించి కొన్నేండ్లుగా భానుడి భగభగలతో మండిపోయిన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు వేసవిలోనూ చల్లని తెమ్మెరలు వీస్తున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో హరితహారం కార్యక్రమంతో వేసవి ఉష్ణోగ్రతలు ఏకంగా ఆరు డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గటం ఈ పథకం ప్రాధాన్యాన్ని తెలుపుతున్నది.
ఐదేండ్ల క్రితంవరకు జిల్లాలో 1 శాతం కూడా అడవులు లేవు. ఇప్పుడు ఏకంగా 10.8 శాతానికి పెరిగాయి. జిల్లాలో గతంలో వేసవిలో అత్యధికంగా 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. రెండేండ్లుగా 44 డిగ్రీలకు మించటంలేదు. జిల్లాలో 6,19,989 ఎకరాల భూమి ఉండగా, 2014కు ముందు 10 వేల ఎకరాల్లో కూడా అడవులు లేవు. ఏడు హరితహారాల్లో పల్లెలు, పట్టణాలన్న తేడాలేకుండా 67,477 ఎకరాల్లో మొక్కలు నాటారు. అవి ఇప్పుడు అడవులను తలపిస్తున్నాయి. జిల్లాలో రికార్డుల ప్రకారం 2.5 శాతం అడవులు ఉండగా వాస్తవంగా మాత్రం ఒకశాతం కూడా లేవు. పేరుకు అటవీ భూములు 27,650 ఎకరాలు ఉన్నా అందులో ఎలాంటి పచ్చదనం ఉండేదికాదు. హరితహారంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
సకాలంలో వర్షాలు
సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో ఏడు విడతల హరితహారంను ఉద్యమంలా నిర్వహించారు. జిల్లాలో 27,650 ఎకరాల అటవీ భూముల్లో 2.17 కోట్ల మొక్కలు, విత్తన బంతులు వేశారు. గ్రామాలు, పట్టణాల రహదారులు, జాతీయ రహదారులతో పాటు ఇంటర్నల్ రోడ్లు కలిపి సుమారు 7,106 కిలోమీటర్ల పొడవున 27,450 ఎకరాల్లో మొక్కలు నాటారు. 473 పల్లె ప్రకృతి వనాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు కలిపి మరో 12,377 ఎకరాల్లో 4.5 కోట్లవరకు మొక్కలు నాటగా అవి నేడు ఏపుగా పెరిగాయి. హరితహారంతో నాటిన మొక్కలు పెరిగి అడవులు ఏర్పడటంతో సకాలంలో వర్షాలు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.
అందరి భాగస్వామ్యంతోనే..
జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులతో పాటు సాధారణ ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం పెరుగుతున్నది. రోడ్ల పక్కన ఎవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ల ఫలితం బాగా కనిపిస్తున్నది. సర్పంచ్‌లు, గ్రామ రెవెన్యూ అధికారుల చొరవ, ప్రభుత్వం ట్రాక్టర్లు ఇవ్వడంతో నేడు ఏ పల్లెకు వెళ్లినా ఏపుగా పెరుగుతున్న పల్లె ప్రకృతి వనాలు, వీధుల వెంట పచ్చదనం దర్శనమిస్తున్నది. జిల్లాలోని 23 మండలాల్లో అన్ని చోట్లా పదెకరాల చొప్పున భూమిని గుర్తించి మెఘా ప్రకృతి వనాలు ఏర్పాటుచేసే ప్రక్రియ కొనసాగుతున్నది.
-వినయ్‌కృష్ణారెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్.
హరితనిధికి 3.30 లక్షల విరాళం
– ఎఫ్డీసీ చైర్మన్ వంటేరుకు అందజేసిన గజ్వేల్ నేతలు
సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన హరిత నిధికి గజ్వేల్ ప్రజాప్రతినిధులు రూ.3.30 లక్షలు విరాళం ఇస్తున్నట్టు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ అర్బన్ పార్కులో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నేతలు విరాళాలు అందజేశారు. గుంటుకు రాజు, కౌన్సిలర్లు ఉప్పలమెట్టయ్య, బాలమణి శ్రీనివాస్‌రెడ్డి రూ.11 వేల చొప్పున ప్రతాప్‌రెడ్డికి అందజేశారు. ఐదోవార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక్బాల్ రూ.5 వేలు, 2వ వార్డు అధ్యక్షుడు పొట్టి రవికుమార్ రూ.5 వేలు విరాళమిచ్చారు. గజ్వేల్ మున్సిపల్ పాలకవర్గం కౌన్సిలర్లంతా రూ.11వేల చొప్పున మొత్తం రూ.2.20 లక్షలు, ఏఎంసీ చైర్పర్సన్ రూ.11 వేలు, 20 వార్డుల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.3.30 లక్షలు అందజేసినట్టు చెప్పారు. ఈ మొత్తాన్ని డీడీ తీసి సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
హరితనిధికి నెలకు 300 విరాళం
బీసీ కమిషన్ సభ్యుడు సీహెచ్ ఉపేంద్ర
రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటుచేసిన హరితనిధికి ప్రతి నెలా రూ.300 చొప్పున విరాళం ఇస్తానని బీసీ కమిషన్ సభ్యుడు, న్యాయవాది సీహెచ్ ఉపేంద్ర ప్రకటించారు. సీఎం కేసీఆర్ సంకల్పం, ఎంపీ సంతోష్‌కుమార్ స్ఫూర్తితో తాను ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించారు.
గ్రీన్ చాలెంజ్‌లో మంత్రి సింగిరెడ్డి
ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్‌లో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి భాగస్వామ్య మయ్యారు. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా వనపర్తిలోని క్యాంప్ కార్యాలయ ఆవరణలో మంత్రి మొక్క నాటారు.
మొక్కనాటిన ప్రొఫెసర్ శాంతాసిన్హా
గ్రీన్ఇండియా చాలెంజ్‌లో రామన్ మెగాసెసె అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతాసిన్హా పాల్గొన్నారు. ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ విసిరిన గ్రీన్ చాలెంజ్‌ని స్వీకరించిన ఆమె.. సోమవారం వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. మానవాళికి చెట్లు ఎంతో అవసరమని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతాసిన్హాకు గ్రీన్ ఇండియా చాలెంజ్ కో-ఆర్డినేటర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు.
గుండా శ్రీనివాస్ గుప్తా