
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): ఏడాదిన్నర కాలంగా ప్రపంచం మొత్తాన్ని తలకిందులు చేస్తూ లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్ ఈసారి పిల్లలను కబళించేందుకు రానుందన్న వార్తలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పటికి రెండు దశలుగా విరుచుకుపడిన మహమ్మారి దాదాపు అన్ని దేశాల్లో పెద్దలను మాత్రమే ముప్పుతిప్పలు పెట్టింది. ఇక మూడోదశలో విస్తరించనున్న వైరస్ పిల్లలపై ప్రభావం చూపుతుందని నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. అన్నట్టుగానే మన పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఇప్పటికే 8 వేల మం ది పిల్లలు వైరస్ బారిన పడినట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. దీంతో దేశంలో థర్డ్‌వేవ్ మొదలైందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరో వారం పదిరోజుల్లో దీనిపై స్పష్టత రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మహారాష్ట్రలోని పిల్లల్లో కరోనా కేసులు పెరుగుతుండటం పక్క రాష్ర్టాలైన తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో దడపుట్టిస్తున్నది. కరోనా సెకండ్‌వేవ్ తొలుత మహారాష్ట్రలోనే వెలుగుచూసింది. ఫిబ్రవరి నుంచే అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నది. ఆ తరువాత వైరస్ మహారాష్ట్రను ఆనుకొని ఉన్న మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకకు విస్తరించింది. మహారాష్ట్ర నుం చి రోగులు అధిక సంఖ్యలో ఇటు హైదరాబాద్‌కు అటు రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాలకు పోటెత్తడంతో వైరస్ తెలంగాణ అంతటా వ్యాపించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల అనంతరం వారం పది రోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. లాక్‌డౌన్‌ను క్రమం గా తొలగిస్తారనుకుంటున్న సమయంలో.. మహారాష్ట్ర పిల్లల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది.
అప్రమత్తంగా ఉండాలి
సెకండ్‌వేవ్‌లో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చినప్పటికీ పిల్లలపై అది పెద్దగా ప్రభావం చూపలేదు. కేవలం 10 శాతం మంది పిల్లలు మాత్రమే వైరస్ బారినపడ్డారు. తల్లిదండ్రుల ద్వారానే వారికి వైరస్ సోకినట్టు వైద్యులు తెలిపారు. మరణాలు కూడా ఒక శాతంలోపే ఉండగా, వెంటిలేటర్ వరకు వెళ్లిన పిల్లల సంఖ్య 0.8 శాతం అని వైద్యనిపుణులు తెలిపారు. అయితే పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర ప్రభావంతోనే మార్చి, ఏప్రిల్‌లో మన రాష్ట్రంపై సెకండ్‌వేవ్ విరుచుకుపడిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
వెయ్యి పడకలతో ప్రత్యేక వార్డు
థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానలోలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దవాఖానలోని పాత భవనంతోపాటు రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్‌లో వెయ్యి పడకలతో పిల్లల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటుచేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపా యి. ఐఐసీ (ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) సంస్థ ఈ ఏర్పాట్లను ఒకటి రెండు నెలల్లో పూర్తిచేయనున్నట్టు సమాచారం. మొత్తం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ వెయ్యి పడకల కరోనా వార్డును నిర్మించనున్నారు. ప్రస్తుతం నిలోఫర్‌లోని ఇన్ఫోసిస్ బ్లాక్‌లో 67 పడకలతో కరోనా ప్రత్యేక వార్డు అందుబాటులో ఉంది. రెండు మూడు రోజుల్లో మరో 83 పడకలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో వెంటనే 150 పడకలు అందుబాటులోకి వస్తాయి.
నోడల్ కేంద్రంగా నిలోఫర్ దవాఖాన
మహారాష్ట్రలో పీడియాట్రిక్ కేసులు పెరుగుతుండటంపై మా బృందాలు దృష్టి పెట్టాయి. అయితే దానిని థర్డ్‌వేవ్‌గా భావించలేం. అక్కడ జనవరి, ఫిబ్రవరిలోనే సెకండ్‌వేవ్ మొదలైంది. అది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో పిల్లలకోసం ప్రత్యేకంగా నిలోఫర్ దవాఖానను నోడల్ కేంద్రంగా ఏర్పాటుచేస్తున్నాం. చిన్నపిల్లలకు సంబంధించి వెయ్యి పడకలతో ప్రత్యేక దవాఖాన నిలోఫర్ వంటిది దేశంలోనే ఎక్కడా లేదు. సెకండ్‌వేవ్ మొత్తంలో పిల్లలకు సంబంధించి సుమారు వెయ్యి కేసులు మాత్రమే మనవద్ద నమోదయ్యాయి. పిల్లలపై వైరస్ ప్రభావం పెద్దగా లేదు. థర్డ్‌వేవ్‌కు సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఆక్సిజన్, వెంటిలెటర్స్, వార్మర్స్వంటి అవసరమైన అన్ని సౌకర్యాలతో నిలోఫర్, గాంధీలో ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాల్లో కూడా పిల్లలకు సంబంధించిన చికిత్సకు సన్నాహాలు చేస్తున్నాం. గాంధీలో ఉన్న మూడు పీడియాట్రిక్ యూనిట్లను మొత్తం కరోనా చికిత్సకే వినియోగిస్తున్నాం. మరికొన్ని పడకలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు మొదలు పెట్టాం.
– డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి