e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home Top Slides పద్మాలూ ఇవ్వరా..? తెలంగాణపై ఎందుకు ఇంత వివక్ష..?

పద్మాలూ ఇవ్వరా..? తెలంగాణపై ఎందుకు ఇంత వివక్ష..?

 • ఇక్కడ కళాకారులు, ప్రముఖులు లేరా?
 • మా దగ్గర అర్హులైనవారు లేరా?
 • ప్రతిపాదనలు ఇచ్చీ ఇచ్చీ విసుగొచ్చింది
 • పంపాల్నా వద్దా అని మోదీనే అడిగిన
 • ఎయిర్‌స్ట్రిప్‌లు అడిగినా ఇవ్వడం లేదు
 • వాటి ఖర్చు భరిస్తామన్నా స్పందనలేదు
 • అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ఆవేదన
 • రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యం
 • మీ ప్రాంతాల్లో పర్యాటక స్థలాలను గుర్తించండి
 • మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రతిపాదనలు పంపండి
 • ఎమ్మెల్యేలతో కమిటీ వేసి అభివృద్ధి చేసుకొందాం

తెలంగాణ చాలా ఉజ్వలమైన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, కళలతో కూడుకున్న ప్రాంతం. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు. తెలంగాణలో అనేక అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి. గడీలు, కోటలు, బురుజులు, చారిత్రక అవశేషాలు అనేకం ఉన్నాయి. రామప్ప చాలా ఉన్నతమైనది. అలంపూర్‌లోని జోగులాంబ ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. దీని ప్రాభవాన్ని కూడా సమైక్య రాష్ట్రంలో బయటికి రాకుండాచేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు విద్యుత్తు, వ్యవసాయం, సాగు, తాగునీరు మీద దృష్టి పెట్టింది. ఇకపై చారిత్రక ప్రదేశాలపై దృష్టిసారిస్తుంది. అన్ని నియోజకవర్గాల్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది.

హైదరాబాద్‌, అక్టోబర్‌ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ర్టానికి పద్మ పురస్కారాలు ఇవ్వడంలోనూ ఉపేక్ష వహిస్తున్నదని, ఎయిర్‌స్ట్రిప్‌లకు అనుమతులు కోరితే పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ర్టాభివృద్ధిపై సభ్యులు అడిగిన ఓ ప్రశ్నపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని మాట్లాడారు. తెలంగాణపై చూపుతున్న నిర్లక్ష్యం పట్ల ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలోనూ గొడవ పెట్టుకొన్నానని పేర్కొన్నారు. పద్మ అవార్డుల కోసం పేర్లు పంపించమంటారా? వద్దంటారా అని అడిగానని, ప్రతిపాదనలు పంపించి విసిగిపోయిన నేపథ్యంలో తాను ప్రధానిని అడిగానన్నారు.

- Advertisement -

‘మా దగ్గర కళాకారులు లేరా? కళలు లేవా? వివిధ రంగాల్లో సేవలుచేసిన విశిష్ట వ్యక్తులు లేరా? పద్మ అవార్డుకు మా దగ్గర అర్హులైన వారు లేరా? తెలంగాణకు ఎందుకు అవార్డు ఇవ్వడం లేదని ప్రధానిని నిలదీసినట్టు చెప్పారు. ‘మీరు చిన్నబుచ్చుకోవద్దు.. తప్పకుండా సానుకూలంగా పరిశీలిస్తాం’ అని ప్రధాని మోదీ చెప్పారని వెల్లడించారు. ‘వాళ్లకు మన మీద దృష్టి వస్త లేదు. ఎయిర్‌స్ట్రిప్‌లు ఇవ్వాలని అడిగినా కూడా ఇవ్వడం లేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాం. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఈ మధ్యనే ఆ శాఖ మంత్రిని ఇంటిని భోజనానికి పిలిచి అడిగాం. వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఉన్నది. మామునూరులో ఎయిర్‌స్ట్రిప్‌ ఇవ్వాలని అడిగాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు నేరుగా మామునూరులో దిగి టెక్స్‌టైల్‌ పార్కుకు వెళతారు. వరంగల్‌ సమీప ప్రాంతాలకు విమానాల రాకపోకలు మొదలైతే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని విడమరిచి చెప్పినం. అయినా కూడా ఇవ్వడంలేదు. వాటి ఖర్చు మేము పెట్టుకుంటామన్నా కూడా ఇవ్వడంలేదు’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

పర్యాటక అభివృద్ధిపై ప్రతిపాదనలు ఇవ్వండి
‘తెలంగాణకు చాలా ఉజ్వలమైన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, కళలతో కూడుకున్న ప్రాంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. నిర్లక్ష్యం చేశారు. తెలంగాణలో అనేక అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి. పాండవుల గుట్ట.. వారసత్వ కోటలు.. రాజాపేట కోటలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వానికి ఇస్తామని వారి వారసులు ముందుకొచ్చారు. దోమకొండ కోట కూడా అప్పగిస్తామన్నారు. గడీలు, బురుజు, కోటలు, చారిత్రక అవశేషాలు ఇలా అనేకమైనవి ఉన్నాయి. రామప్ప చాలా ఉన్నతమైనది. అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారు దేశంలోని అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. కానీ దీని ప్రాభవాన్ని కూడా సమైక్య రాష్ట్రంలో బయటికి రాకుండాచేశారు. తెలంగాణలో అద్భుతమైన ప్రకృతి సోయగాలు ఉన్నాయి.

ఇప్పుడు కాళేశ్వరం ద్వారా గోదావరి నదిలో 160 కిలోమీటర్ల మేర నీరు నిలిచి ఉంటున్నది. అద్భుత సుందర దృశం ఆవిష్కృతమవుతున్నది. ప్రభుత్వం ఇప్పటివరకు విద్యుత్తు, వ్యవసాయం, సాగు, తాగునీరు మీద దృష్టి పెట్టడం వల్ల పర్యాటకం, చారిత్రక ప్రదేశాలపై అంతగా దృష్టి పెట్టలేదు. అన్ని జిల్లాల శాసనసభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని పర్యాటక ప్రాంతాలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రతిపాదనలు అందించండి. వాటన్నింటిపై చర్చించి అభివృద్ధి ప్రణాళికను అమలు చేయడం జరుగుతుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభలో చెప్పారు. తెలంగాణ ఒక దరికి వచ్చింది కాబట్టి.. రాష్ట్రంలో పర్యాటక పరంగా కోటలు, బురుజులు విశిష్ట దేవాలయాలు, ప్రాకృతిక ప్రాంతాలు ఇలా అన్ని ప్రముఖ ప్రాంతాల పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement