హైదరాబాద్, డిసెంబర్26 (నమస్తే తెలంగాణ) : బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని, లేదంటే కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు తప్పదని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రిజర్వేషన్లపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల పెంపు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.
42శాతం బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారని, ఇప్పుడు మాట మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే 31న అఖిలపక్ష సమావేశం, ఫిబ్రవరిలో బీసీల బస్సుయాత్ర, ఏప్రిల్‌లో హైదరాబాదులో బహిరంగసభ నిర్వహించనున్నట్టు చెప్పారు. సమావేశంలో జేఏసీ వరింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, ప్రొఫెసర్ బాగయ్య, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, బీసీ జేఏసీ కోచైర్మన్ కాటేపల్లి వీరస్వామి, బీసీ జేఏసీ వైస్‌చైర్మన్ శ్రీధర్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్ పాల్గొన్నారు.