బజార్హత్నూర్, డిసెంబర్ 17 : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులు మంగళవారం మండుటెండలో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ బడిలో దాదాపు 250 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. పాఠశాల ఆవరణ, తరగతి గదుల్లో భోజనం చేస్తున్నారు. కేసీఆర్ సర్కారు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగం గా డైనింగ్ హాల్ మంజూరు చేసింది. పనులు ప్రారంభమై గోడలు కూడా కట్టారు. ఇంతలోనే కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో తినడానికి కనీసం నీడ కూడా లేకపోవడంతో మండుటెండల్లోనే భోజనం చేస్తున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ‘మన ఊరు- మన బడి’ పథకాని కి సంబంధించిన బిల్లులు చెల్లించి, పనులు పూర్తి చేయించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. చాలా గ్రామాల్లో పాఠశాల భవనాలు అసంపూర్తిగా ఉన్నాయని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. తమ ఊర్లోనే ‘మన ఊరు- మన బడి’ కింద జడ్పీ హైస్కూల్ భవనానికి స్లాబ్ వేశారు కానీ, గోడలు, కిటికీలు లేవని పేర్కొన్నారు. కొత్త ప్ర భుత్వం.. ఆ పథకాన్ని అమ్మ ఆద ర్శ పాఠశాలగా మార్చింది కానీ, అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేస్తే బాగుండేదని తెలిపారు. చాలా చోట్ల పిల్లలు చెట్ల కింద కూర్చునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ప్రత్యేక శ్రద్ధతో పనులు పూర్తిచేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి చైర్మన్ తీసుకెళ్లారు.