హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో చదువుల జిల్లాగా పేరొందిన నల్లగొండ ఇప్పుడు వెనుకబడిపోతుంది. ఆ జిల్లాలో ఒక్కప్పుడు ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ స్కూళ్లు ఇప్పుడు చేరేవారు లేక వెలవెలబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జీరో ఎన్రోల్మెంట్ బడులున్న జిల్లాగా నల్లగొండ నిలిచింది. ఈ జిల్లాలో ఏకంగా 315 జీరో ఎన్రోల్మెంట్ బడులు ఉన్నాయి. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాల్లో 167, వరంగల్లో 135 చొప్పున జీరో ఎన్రోల్మెంట్ బడులున్నాయి. కాగా, రాష్ట్రంలో సర్కారు బడుల్లో జీరో ఎన్రోల్మెంట్ బడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటేటా పెరుగుతున్నాయి.
ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ జీరో ఎన్రోల్మెంట్ బడులున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. రాష్ట్రంలో సున్నా అడ్మిషన్లతోపాటు పదిలోపు విద్యార్థులున్న బడుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. ఇలాంటి బడులు 2022-23లో 3,576 ఉండగా, 2023-24కు వచ్చేసరికి 4,626కు పెరిగాయి. 2024-25కు వచ్చేసరికి ఇవి 5,021 అయ్యాయి. ఈ బడుల్లో 4వేలకు పైగా టీచర్లు పనిచేస్తున్నట్టు కేంద్రం గణాంకాలు సహా వెల్లడించింది.
ఆదిలాబాద్ (42), భదాద్రి కొత్తగూడెం (14), హనుమకొండ (41), హైదరాబాద్ (20), జగిత్యాల (60), జనగామ (70), జయశంకర్భూపాలపల్లి (38), జోగుళాంబ గద్వాల (10), కామారెడ్డి (48), కరీంనగర్ (51), ఖమ్మం (65), కుమ్రం భీం ఆసిఫాబాద్ (65), మహబూబ్నగర్ (53), మంచిర్యాల (35), మెదక్ (27), మేడ్చల్-మల్కాజిగిరి (11), ములుగు (54), నారాయణపేట (37), నిర్మల్ (48), నిజామాబాద్ (38), పెద్దపల్లి (33), రాజన్నసిరిసిల్ల (26), సంగారెడ్డి (56), వికారాబాద్ (66), వనపర్తి (33), యాదాద్రిభువనగిరి (65).
