హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని వైసీపీ నేతలు వాకౌట్ చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ అబ్దుల్నజీర్ ప్రసంగంతో ప్రారంభించారు. అనంతరం బీఏసీ సమావేశంలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి19 వరకు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే మరో రెండురోజులు సమావేశాలు పొడిగించాలని నిర్ణయించారు. నిరుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానని వెల్లడించిన మాజీ సీఎం వైఎస్ జగన్ తొలిరోజు సమావేశానికి హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే వైసీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేస్తూ పొడియాన్ని చుట్టుముట్టి గవర్నర్ ప్రసంగ ప్రతులను చించివేశారు. ఆ తర్వాత పది నిమిషాలకే వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు.