హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): అడిగిన డబ్బులు ఇవ్వనందుకు కన్నతల్లిని ఓ కొడుకు అతిదారుణంగా గొంతుకోసి హత్యచేసిన దారుణ సంఘటన ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరు శ్రీరామ్‌నగర్‌కు చెందిన ఉప్పలూరు లక్ష్మీదేవి, విజయభాస్కర్‌రెడ్డి దంపతులకు కుమారుడు యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఉన్నాడు. లక్ష్మీదేవి ఈశ్వర్‌నగర్‌లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండేది. యశ్వంత్‌రెడ్డి మూడేండ్ల క్రితం చెన్నైలో బీటెక్ పూర్తిచేసి, ఉద్యోగాన్వేషణ కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. అవసరాల కోసం అప్పుడప్పుడు తన తల్లిని డబ్బులు అడిగి తీసుకునేవాడు.
ఈక్రమంలో తనకు రూ.10 వేలు కావాలని యశ్వంత్‌రెడ్డి తన తల్లిని అడిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో కోపం పెంచుకున్న అతడు.. ఆదివారం హైదరాబాద్ నుంచి నేరుగా ప్రొద్దుటూరులోని తన ఇంటికి వెళ్లాడు. వచ్చీరాగానే తల్లితో గొడవకు దిగాడు. ఆమె గట్టిగా అరవడంతో పక్క గదిలో ఉన్న తండ్రి భాస్కర్‌రెడ్డి బయటకు వచ్చే ప్రయత్నం చేయగా.. అతడిని లోపలికి నెట్టేసి గదికి గడియపెట్టాడు. ఆ తర్వాత కూరగాయల కత్తితో తల్లి గొంతు కోసి.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లి బయటపడేశాడు. ఆపై ఇంట్లో దర్జాగా టీవీ చూస్తూ కూర్చున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.