హైదరాబాద్, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ): 25 ఏండ్లలోపు యువత ‘గోవింద కోటి’ రాస్తే వారి కుటుంబానికి వీఐపీ దర్శనం కల్పించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతన మంగళవారం జరిగిన నూతన పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సనాతన ధర్మ వ్యాప్తి కోసం, యువతలో భక్తిభావం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులందరికీ అర్థమయ్యేలా భగవద్గీత పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ముంబైలోని బాంద్రాలో వేంకటేశ్వరస్వామి ఆలయం, సమాచార కేంద్రం నిర్మించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
29 స్పెషలిస్ట్, 15 చిన్నపిల్లల వైద్యులతో పాటు 300 మంది ఉద్యోగుల నియామకానికి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు రూ. 2.16 కోట్లతో టీటీడీ దవాఖానల్లో మందుల కొనుగోలు, 47 వేద అధ్యాపక పోస్టుల నియామకాలకు పాలకమండలి సమావేశం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఈనెల 18 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. రూ.2 కోట్లతో చంద్రగిరి మూలస్థాన ఆలయ పునర్నిర్మాణం, రూ.49.5 కోట్లతో టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్ మరమతులు చేయించనున్నట్టు పేర్కొన్నారు. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను కరుణాకర్‌రెడ్డి ఖండించారు.
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించేలా చర్యలు చేపట్టాలని పాలక మండలి సభ్యురాలు సీతా రంజిత్‌రెడ్డి.. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన వచ్చే పాలకమండలి సమావేశం కంటే ముందే దీనిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సీతారంజిత్‌రెడ్డి తెలిపారు.