హైదరాబాద్ : యువతను క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పశు సంవర్ధక , సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జింఖానా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన యువజనోత్సవాలను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పాశ్చాత్య సంస్కృతి బారినపడి భవిష్యత్ ను అంధకారం చేసుకోవద్దని పిలుపునిచ్చారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలో రాణించాలని అం దుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, క్రీడా, సాంస్కృతిక రంగాల్లోనూ ముందంజలో యువతను ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. క్రీడా, సాంస్కృతిక రంగాలను బలోపేతం చేసేందుకు జిల్లాస్థాయిల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్మాణం చేపట్టిందన్నారు.
ఏ దేశంలో లేని విధంగా ఇండియాలో ఉన్న సంస్కృతి , సంప్రదాయాలు గొప్పవని అన్నారు. మనం ఏ స్థాయిలో ఉన్న తల్లిదండ్రులను, గురువులను మరిచపోరాదని సూచించారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ ను చాటి తల్లిదండ్రులకు గుర్తింపు తీసుకురావాలని కోరారు.