హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): అగ్నివీర్లో చేరేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యువకులు ఆసక్తి చూపడం లేదని, రిక్రూట్మెంట్ విషయంలో ఆ రెండు రాష్ర్టాలు వెనుకబడి ఉన్నాయని ఎయిర్‌మెన్ సెలెక్షన్ సెంటర్ (ఏఎస్సీ) కొత్త కమాండింగ్ ఆఫీసర్ యాకుబ్ అలీ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అగ్నివీర్ పోటీదారుల సంఖ్య చాలా తకువగా ఉన్నదని చెప్పారు.
భారత వైమానిక దళంలో ఉన్న అపారమైన ఉద్యోగ అవకాశాలపై యువతలో అవగాహన పెంచాల్సిన అవసరమున్నదని పేరొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని నియామక శిబిరాలు నిర్వహించి, యువతను ఉత్తేజపర్చే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వింగ్ కమాండర్ అలీ చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందించారు. యువత దేశానికి సేవ చేసేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.