సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 01, 2020 , 16:02:36

బాలికకు నిప్పు పెట్టిన ఘటనపై మంత్రి సత్యవతి సీరియస్

బాలికకు నిప్పు పెట్టిన  ఘటనపై  మంత్రి  సత్యవతి   సీరియస్

మహబూబాబాద్:  బాలికపై అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘాతుకంపై రాష్ట్ర మహిళా-శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలిపారు.  రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ఘాతుకంపై సూర్యాపేట జిల్లా ఎస్పీతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు వెంకటేశ్ పై  కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. 

బాలికలు, మహిళల పట్ల ఇలాంటి దారుణాలు జరగకుండా పోలీసు శాఖ మరింత అప్రమత్తంగా పనిచేయాలని, అవగాహనా చర్యలు చేపట్టాలని కోరారు.  తెలంగాణ రాష్ట్రంలో మహిళల పట్ల ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తి లేదని, ఇలాంటి సంఘటనలకు తావు లేదని, పునరావృతం కాకుండా చర్యలు చేపడుతామని చెప్పారు.  మంటల్లో కాలి, గాయాలపాలై వరంగల్ ఎంజీఎం దవాఖానాలో చికిత్స పొందుతున్న బాలికకు అయ్యే ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని,   మెరుగైన వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.  గుగులోతు వెంకటేశ్‌ అనే యువకుడు ప్రేమ పేరుతో ఓ బాలికను వేధించి, అత్యాచారం చేసి, ఆపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో జరిగింది.  


logo