Mahalakshmi Scheme | హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘మహిళలను గౌరవించండి.. వారికి కేటాయించిన సీట్లను వారికే ఇవ్వండి’.. ఇది ఆర్టీసీ బస్సుల్లో కనిపించే స్లోగన్. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. దీంతో బస్సుల్లో తమకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొన్నదని పురుషులు వాపోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో పురుషులకూ ప్రత్యేక సీట్లు కేటాయించాలని నిరసన వ్యక్తం చేసిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఓ యువకుడు బస్టాండ్‌లో బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపాడు.
నగరంలోని మెహిదీపట్నం రూట్లో సైతం పురుషులు బస్సుల్లో సీట్లు లేవని బస్టాండ్‌లో నిరసనకు దిగడం గమనార్హం. బస్సుల్లో కనీసం 15 సీట్లు పురుషులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మహిళలు వారికి కేటాయించిన సీట్లే కాకుండా పురుషుల సీట్లలోనూ కూర్చుంటున్నారని దాంతో అత్యవసరంగా వెళ్లే తమకు సీట్లు దొరకటం లేదని వాపోతున్నారు. మహిళలంటే తమకు గౌరవమేనని.. వారికి బస్సుల్లో 30 సీట్లు కేటాయిస్తే.. కనీసం 15 సీటె్లైనా పురుషులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
వికారాబాద్ జిల్లా తాండూర్ బస్‌డిపో ఎదుట శనివారం మహిళ ప్రయాణికులు ఆందోళన చేశారు. దాదాపు రెండు గంటలు గడిచినా హైదరాబాద్ వెళ్లేందుకు బస్సులు లేవంటూ ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నపిల్లలతో చాలాసేపు వేచి చూడాల్సి వస్తుందని, ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. కొన్ని జిల్లాల్లో రూట్ బస్సులు తక్కువగా ఉండటంతో ఒకే బస్సులో కెపాసిటీకి మించి జనం ఎక్కడంతో బస్సులు నిలిచిపోతున్నాయి. ఇలాంటి ఘటన ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. ఇలాంటి సంఘటనలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నామని.. కొన్ని సందర్భాల్లో, కొన్ని రూట్లలో మాత్రమే ఈ సమస్య తలెత్తుతుందని తెలిపారు. త్వరలోనే కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయని, బాగా రద్దీ ఉన్న రూట్లలో అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.