అశ్వారావుపేట/ములకలపల్లి, డిసెంబర్ 5 : కోతులను అరికడితేనే ఓటు వేస్తామంటూ ఆ గ్రామ యువకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. దీంతో సర్పంచ్ అభ్యర్థులు, రాజకీయ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారంలో శుక్రవారం తాండ్ర నాగబాబు నేతృత్వంలో మిరియాల విశాంత్, ఉప్పునీతి రాజు, గడప నరసింహారావు, నారం నవీన్, కొంగల శివ తదితర యువకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోతుల వల్ల పంటలు దెబ్బతింటున్నాయని, రైతులు ఆర్థికంగా నష్టపోతున్నందున కోతుల సమస్యను పూర్తిగా పరిష్కరించే వారికే తమ ఓటు వేస్తామని ప్రకటించారు. ఇండ్లల్లో సైతం కోతులు చొరబడుతున్నాయని, అనేకమందిని గాయపర్చాయని పేర్కొన్నారు. సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు కోతుల బెడదను నివారించాలని డిమాండ్ చేశారు.