బడంగ్పేట్, మే 6 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను, ఉద్యోగ సంఘాలు పంపిన మెసేజ్‌ని వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నందుకు బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) నాగేశ్వరరావుపై యూత్ కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. ‘నీ సంగతి చూస్తాం.. ఇక్కడ ఉద్యోగం చేయలేవ్..’ అంటూ దుర్భాషలాడారు. భయభ్రాంతులకు గురైన మేనేజర్ పదే పదే సారీ చెప్తున్నా వినకుండా వాగ్వాదానికి దిగారు. ముఖ్యమంత్రి మాటలను స్టేటస్ ఎలా పెట్టుకుంటావంటూ తొలుత ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు దిగారు. నేరుగా బడంగ్‌పేట మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి హల్చల్ చేశారు. దీంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సదరు అధికారి సర్దిచెప్పినా వినకుండా వాగ్వివాదానికి దిగారు. నీ సంగతి చూస్తామంటూ బల్లగుద్ది వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ ఉద్యోగం చేయలేవంటూ వార్నింగ్ ఇచ్చారు. మేనేజర్ నాగేశ్వరరావు పదే పదే సారీ చెప్పినా వినలేదు. సారీ చెప్తే సరిపోతుందా? అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. సిబ్బంది సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా యూత్ కాంగ్రెస్ నేతలు వినలేదు.
చిన్నచిన్న విషయాలకు కార్యాలయాలకు వచ్చి దాడులు చేస్తామంటే ఇక ఉద్యోగం చేసేది ఎలా? అని మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. పేపర్లో వచ్చిన వార్తలను, టీవీల్లో మాట్లాడిన మాటలను స్టేటస్‌గా పెట్టుకుంటే ఇలా దాడులు చేస్తారా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా కొత్త సంస్కృతికి తెర లేపుతున్నారని మండిపడ్డారు.
‘ప్రభుత్వ ఉద్యోగులు భారమైనప్పుడు అధికారం దక్కించుకోవాలన్న స్వార్థంతో ఉచిత పథకాలు పెట్టమని మిమ్మల్ని ఎవరు అడిగారు? ప్రజలు అడగలేదు, ప్రభుత్వ ఉద్యోగులు అడగలేదు సార్ ఆలోచించండి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఉద్యోగులు ఎవ్వరూ కేసీఆర్‌కు ఓటు వేయలేదు. రేపటిరోజున మీరూ అదే పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది’ అని మేనేజర్ నాగేశ్వరరావు తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నారు.