ఫర్టిలైజర్ సిటీ, ఏప్రిల్ 16: ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగం రావడం లేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని పవర్‌హౌజ్ కాలనీలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పవర్‌హౌజ్ కాలనీకి చెందిన చుంచు ప్రత్యూష(26) ఎంకామ్ వరకు చదువుకున్నది. ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసింది. ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూలేని సమయంలో మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. కుటుంబ సభ్యులు ఆలస్యంగా చూడడంతో బుధవారం వెలుగులోకి వచ్చింది. ప్రత్యూష తండ్రి విఠల్ కోర్టు వద్ద టీస్టాల్ నిర్వహిస్తున్నాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు గోదావరిఖని వన్‌టౌన్ ఎస్ఐ భూమేశ్ పేర్కొన్నారు.