ధర్మపురి, జూలై 8: కూల్ డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి పందొమ్మిదేళ్ల యువతిపై ఓ ఆన్లైన్ పత్రిక విలేకరి లైంగికదాడి చేసి, వీడియోలు తీసిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో వెలుగు చూసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం కలకలం రేపింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ధర్మపురి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు గాదెపెల్లి గ్రామానికి చెందిన విలేకరి వెలుగు గంగాధర్‌తో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఆమె భర్త గతంలోనే చనిపోగా ఒక్క కూతురు ఉంది.
తన కూతురు పదోతరగతి వరకు చదివి ఇంటివద్దనే ఉంటున్నదని, ఉన్నత చదువులు చదవాలని అనుకుంటున్నదని సదరు మహిళ గంగాధర్‌తో చెప్పగా, సహకరిస్తానని నమ్మబలికాడు. ఉన్నత చదువుల కోసం కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం ఉండటంతో కూతురును తీసుకొని పది రోజుల క్రితం ధర్మపురికి వచ్చింది.
గంగాధర్‌కు ఫోన్ చేయడంతో అతను వారి వద్దకు వచ్చి సర్టిఫికెట్లు తీసుకువస్తానని చెప్పాడు. తల్లీకూతుళ్లను గోదావరి ఒడ్డున ఓ కల్యాణమండపానికి సంబంధించిన గదిలో ఉంచాడు. కొద్ది సేపటి తర్వాత గంగాధర్ బీర్లు, కూల్‌డ్రింక్, బిర్యానీ ప్యాకెట్లు తీసుకొని గదికి వచ్చాడు. గంగాధర్ బీర్ తాగు తూ, తల్లీకూతుళ్లు కూల్ డ్రింక్ తాగుతూ ముగ్గురూ కలిసి బిర్యానీ తిన్నారు. పథకం ప్రకారం కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలుపడంతో తల్లీబిడ్డలు గాఢ నిద్రలోకి జారుకున్నారు.
ఇదే అదనుగా భావించిన గంగాధర్ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం సెల్ఫోన్లో వీడియో తీశాడు. సాయంత్రం మత్తు దిగడంతో తల్లీకూతుళ్లు గ్రామానికి చేరుకున్నారు. యువతిని నగ్నంగా తీసిన వీడియోలను గంగాధర్ తన స్నేహితుడికి వాట్సాప్ చేశాడు. అవి కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో యువతి తన తల్లితో కలిసి మంగళవారం ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ ఉదయ్‌కుమార్ కేసు నమోదు చేసి, యువతిని వైద్యపరీక్షలకు పంపారు. మంగళవారం గంగాధర్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్టు సీఐ రాంనరసింహారెడ్డి తెలిపారు.