మంథని, మార్చి 21: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లతో యువత చిత్తవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే అత్యాశతో లక్షలాది రూపాయలు పెట్టి, అప్పుల పాలై నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లాలో ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్‌లకు బలికావడం కలకలం రేపుతున్నది. మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరబోయిన సాయితేజ(26) ప్రేమ వివాహం చేసుకొని ఐదేళ్లుగా గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో నివాసముంటున్నాడు. ప్రైవేట్ దవాఖానల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తూ భార్య దీపిక, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాడు.
సోషల్ మీడియాలో వచ్చే రీల్స్‌ను చూసి, తక్కవ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చని ఆశపడి ఆన్లైన్ బెట్టింగ్ మొదలు పెట్టాడు. స్నేహితులు, పరిచయస్తుల వద్ద అప్పులు చేస్తూ వన్ ఎక్స్ బీట్, లోటస్ 36, డఫాబీట్, కలర్ ప్రిడక్షన్, 11క్లబ్‌తో పాటు మరికొన్ని ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల్లో భారీగా డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాడు. ఆన్లైన్ గేమ్‌ల ద్వారా అప్పుల పాలయ్యానని, అప్పులు తీర్చాలని ఇంట్లో చెప్పడంతో రూ.5లక్షలు కుటుంబ సభ్యులు తీర్చారు. సాయితేజ్ మళ్లీ ఆన్లైన్ గేమ్‌లు ఆడుతూ అప్పులు చేశాడు. ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు రాక అప్పులు పెరిగి పోవడంతో మద్యానికి బానిసయ్యాడు.
ఈ నెల 18వన సింగిరెడ్డిపల్లె శివారులో గడ్డి మందు తాగి తన స్నేహితుడికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో స్నేహితులు అక్కడికి వెళ్లి చూడగా, అప్పటికే సాయితేజ అపస్మారక స్థితిలోకి ఉన్నాడు. వెంటనే స్నేహితులు గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కరీంనగర్ తరలించారు. కరీంనగర్లో చికిత్స పొందుతున్న గురువారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు గోదావరిఖని టూటౌన్ ఎస్సై రామలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.