వైరా రూరల్, ఆగస్టు 9: ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతులకు రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. తమ భూమిపై ఉన్న రూ.88 వేల రుణాన్ని మాఫీ చేయలేదని, 68 ఏండ్ల తన తండ్రికి ఆసరా పింఛన్ కూడా ఇవ్వడం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తంచేశాడు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం తమ గ్రామానికి వస్తున్నట్టు తెలుసుకున్న ఆ యువకుడు గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలంలో జరిగింది. వైరా మండలం కేజీ సిరిపురం గ్రామానికి చెందిన నారపోగు నాగకృష్ణ.. తండ్రి నారపోగు భిక్షం పింఛన్ కోసం అనేకసార్లు దరఖాస్తు చేసినా మంజూరు కాలేదు.
అలాగే వారి 1.20 ఎకరాల వ్యవసాయ భూమిపై ఉన్న రూ.88 వేల పంట రుణం మాఫీ కాలేదు. తమ బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాడు. స్థానిక ఎమ్మెల్యేతోపాటు ఉప ముఖ్యమంత్రే తమ గ్రామానికి వస్తున్నట్టు తెలుసుకుని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. స్వయంగా డిప్యూటీ సీఎం వచ్చి తమ సమస్యను పరిష్కరిస్తేనే తాను ఈ టవర్ దిగుతానని స్పష్టంచేశాడు. దీంతో స్థానిక మాజీ ఎంపీటీసీ, స్థానిక కాంగ్రెస్ నాయకులు వెంటనే సెల్ టవర్ వద్దకు చేరుకుని ‘నీ సమస్యను డిప్యూటీ సీఎంకు తెలియజేస్తాం. 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం’ అని హామీ ఇవ్వడంతో ఆ యువకుడు సెల్ టవర్ దిగాడు.