Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సందు దొరికితే చాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబు భజన చేస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా గురువారం జరిగిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఆయన మరోసారి తన భక్తిని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ తరువాత విద్యార్థులతో ఫుట్‌బాల్ ఆడి, సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన నెహ్రూ, ఇందిరాగాంధీతోపాటు ఎన్టీఆర్, చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు.
‘మొట్టమొదటిసారి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చింది ఎన్టీరామారావు. పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా ఆయనను గుర్తు చేసుకుంటాడు. ఐటీ కంపెనీలను, హైటెక్ సిటీని చూసినప్పుడు చంద్రబాబునాయుడు గుర్తొస్తారు’ అంటూ వ్యాఖ్యానించారు. నిరుడు ఆగస్టులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ వేసిన పునాదితోనే హైదరాబాద్‌లో ఐటీ రంగం వేళ్లూనుకున్నదని చెప్పారు. ‘రాజీవ్‌గాంధీ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేశారు.
నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హైటెక్ సిటీకి పునాదిరాయి వేశారు. హైదరాబాద్‌లో ఐటీరంగ నిపుణుల తయారీకి కాంగ్రెస్ కృషి చేసింది’ అంటూ స్కిల్ యూనివర్సిటీపై చర్చ సందర్భంగా చెప్పారు. అప్పుడేమో ఐటీకి కాంగ్రెస్ పునాది వేసిందని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడును ఐటీకి ఆద్యుడ్ని చేసేశారని కొందరు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
‘ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్లినా కూడా.. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 16 నెలలు అవుతున్నది. మీకంటూ ఎలాంటి బ్రాండ్ సృష్టించుకోలేదు అని పలువురు పాత్రికేయులు, మిత్రులు అంటున్నారు. చాలా సందర్భాల్లో నేను నవ్వి వదిలేసిన. ఎందుకంటే నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నానో ప్రశ్న అడిగేవారు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. యంగ్ ఇండియా అనేది నా బ్రాండ్’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మహాత్ముడి స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్‌ను తెలంగాణలో క్రియేట్ చేసుకున్నామని అన్నారు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ సూల్స్ నిర్మించబోతున్నట్టు వెల్లడించారు. ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ పాఠశాలల విధానంలో మార్పులు తీసుకొచ్చి ప్రీ-సూల్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సైనిక్ సూల్కు దీటుగా పోలీస్ సూల్ను తీర్చిదిద్దుతామని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఇక్కడ చదువుకునే విద్యార్థులను అకడమిక్స్‌తోపాటు అన్ని రంగాల్లో మెరుగ్గా రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.
డీజీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ స్కూల్ ఏర్పాటుకు ప్రత్యేకంగా ఒక కమిటీని వేసుకొని, పని విభజన చేసి సకాలంలో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఫీజు ఎక్కువగా ఉన్న అంశంపై పలువురు అభ్యంతరం చెప్త్నురని, దీనిపై సుదీర్ఘంగా చర్చించి, తర్వలోనే తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. పోలీసులకు ప్రత్యేకంగా పోలీసు స్కూల్ తీసుకొచ్చినందుకు డీజీపీ జితేందర్ ముఖ్యమంత్రికి కృతజ్ఞలు తెలిపారు.
ప్రభుత్వం ఘనంగా చెప్తున్న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను రేకులతో నిర్మించడం దుమారం రేపింది. అది మూ సీపకన బఫర్ జోన్లో ఐదేండ్ల కింద కట్టి న తాత్కాలిక కట్టడమని తెలిసింది. ఈ రేకులషెడ్డును రెనోవేషన్ చేసి కొత్తదాని లాగా బిల్డప్ ఇచ్చారనే వాదన ఉన్నది. 2024 అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన ఈ సూల్ను ఆరు నెలల్లోనే ప్రారంభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కానీ, అది రేకుల షెడ్డు అని తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. కేసీఆర్ హయాంలో గ్రేహౌండ్స్ బ్యారక్ కోసం 2020లో వేసిన షెడ్‌ను బాగుచేసి దానికే ‘యంగ్ ఇండియా పోలీస్ సూల్’ అని రేవంత్ నామకరణం చేశారు.