Young India Schools | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్ఎస్) అంచనాలు భారీగా పెరగడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భవనాల నిర్మా ణ అంచనా వ్యయాన్ని రెట్టింపు చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 20 యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి విద్యాశాఖ బుధవారం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. మొత్తం రూ.4వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపింది. అంటే.. ఒక్కో స్కూల్‌కు రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నట్టు జీవోలో పేర్కొన్నది. అయితే.. గతంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిన లెక్కలకు, ఇప్పుడు ఇచ్చిన జీవోకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో అనుమానాలు తలెత్తుతున్నాయి.
నిరుడు జూలై 23న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌పై రూ. 80 -100 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. గతేడాది అక్టోబర్ 12 రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌లో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘రూ.125 నుంచి రూ.150 కోట్లతో స్కూల్‌ను నిర్మించి షాద్ నగర్ ప్రజలకు అందిస్తున్నాం’ అంటూ సీఎం వ్యాఖ్యానించారు. కానీ విద్యాశాఖ ఇప్పుడు రూ.200 కోట్లుగా పేర్కొన్నది. డిప్యూటీ సీఎం ప్రకటించిన మూడు నెలల తర్వాత అంచనా వ్యయం 50 శాతం పెంచి సీఎం చెప్పగా, ఏడాది తిరిగే సరికి ఏకంగా రెట్టింపు అయ్యిందని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. దీని వెనుక భారీ దోపిడీకి ప్లాన్ చేశారని ఆరోపిస్తున్నారు.
చక్రం తిప్పిన ఆర్కిటెక్ట్..?
స్కూళ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న తర్వాత కర్ణాటకకు చెందిన ఓ ప్రైవేట్ ఆర్కిటెక్ట్ కన్సల్టెన్సీ రంగప్రవేశం చేసినట్టు సమాచారం. ఆ సంస్థ డీపీఆర్‌ను తయారు చేసి ఒక్కో స్కూల్‌కు దాదాపు రూ.300 -350కోట్లు ఖర్చయ్యేలా నివేదిక సిద్ధం చేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అంత మొత్తమంటే అనుమానాలకు తావిస్తుందన్న సూచనలతో రూ.200 కోట్లకు కుదించినట్లు సమాచారం. భట్టి చెప్పినట్టు రూ.80-100 కోట్లతో చేపట్టినా 20 స్కూళ్లకు రూ.1,600-2000 కోట్లు సరిపోయేవని, సీఎం చెప్పినట్టు రూ.125-150 కోట్ల తో అనుకున్నా రూ.2,500-3000 కోట్లు అయ్యేవని అంటున్నారు. అలా కాకుండా రూ.200కోట్లకు అంచనాలు పెంచడంతో బడ్జెట్ రూ.4వేల కోట్లకు చేరిందని.. ఇది ముందస్తు అంచనాల కన్నా రెట్టింపు అని విశ్లేషిస్తున్నారు. తొలి దశలో త్వరలోనే రూ.7వేల కోట్లతో మరో 35 స్కూళ్లను, తర్వాత రూ.10వేల కోట్లతో మరో 50 స్కూళ్లను నిర్మిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. మొత్తంగా రూ.21వేల కోట్లను ఖర్చుచేయనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం చెప్పిన లెక్కల ప్రకారం రూ.12-15వేల కోట్లతో పూర్తయ్యే నిర్మాణాలకు రూ.21వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారని చెప్తున్నారు.
యంగ్ ఇండియా స్కూల్ స్కామ్ – మన్నె క్రిశాంక్
యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం వెనుక కుంభకోణం ఉన్నదని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆరోపిస్తూ బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మొదట రూ.80 కోట్లతో నిర్మాణాలు చేపడతామని, ఆ తర్వాత రూ.100 కోట్లకు పెంచారని, మళ్లీ రూ.125 కోట్లకు చేర్చారన్నారు. చివరికి ఒక్కో స్కూల్‌కు రూ.200కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేశారన్నారు. కమీషన్ల కోసమే రూ.1,600 కోట్లతో కట్టాల్సిన భవనాలను రూ.4వేల కోట్లకు పెంచారని ఆరోపించారు.
ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి రూ.80-100 కోట్ల వరకు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (2024 జూలై 23న)
125-150 కోట్లతో కొందుర్గ్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను నిర్మించి షాద్ నగర్ ప్రజలకు అందిస్తున్నాం
– సీఎం రేవంత్ రెడ్డి (2024 అక్టోబర్ 11న)
ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు – 2025 మే 27న జీవో విడుదల