జూలూరుపాడు, మార్చి 30 : మక్కజొన్న కంకులు తిని అస్వస్థతకు గురై యువరైతు మృతిచెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వినోభానగర్‌లో ఆదివారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వినోభానగర్‌కు చెందిన జరుపల కృష్ణ (30) తన ఐదెకరాల భూమిలో ఓ కంపెనీకి చెందిన మేల్, ఫిమేల్ మక్కజొన్న సాగు చేశాడు. మక్కజొన్న కంకులు విరిసేందుకు సిద్ధంగా ఉండటంతో వారంరోజులుగా పొలం వద్ద కాపలా కోసం వెళ్తున్నాడు. ఆ సమయంలో చేను వద్ద రోజూ కంకులు కాల్చుకొని తింటున్నాడు. దీంతో రెండ్రోజులుగా కాళ్లు లాగడం ఒళ్లంతా నీరసించిపోవడం లాంటి సంకేతాలు కనిపిస్తున్నాయని కుటుంబ సభ్యులకు తెలిపాడు. మేల్, ఫిమేల్ మక్కజొన్న కంకులు తినడం వల్లే ఇలా జరుగుతుందని తెలియక వాటిని తినడం ఆపలేదు. దీంతో ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.